పిల్లలు లేని దంపతులకు స్ఫూర్తినిస్తున్న అమెరికా జంట
జీవితంలో ఎప్పుడు ఎటువంటి మలుపులువస్తాయో ఎవరూ ఊహించలేరు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా దంతేవాడకు చెందిన మూడేళ్ల దివ్వాంగ బాలుడు ఆకాశ్ విషయంలో అదే జరిగింది. ఈ బాలుడు సామాజిక్ జన్ వికాస్ సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. మూడేళ్లనుంచి ఇక్కడ ఉంటున్న ఆకాశ్‌ను అమెరికా కు చెందిన బర్ట్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం వారు న్యాయపరమైన ప్రక్రియనంతా పూర్తి చేశారు. దీంతో ఇకపై ఆ చిన్నారి వారి సంరక్షణలో పెరగనున్నాడు.
వివరాల్లోకి వెళితే కోల్‌కత్తాకు చెందిన చంద్రాను గతంలో అమెరికా దంపతులు దత్తత తీసుకున్నారు. తరువాత ఆమెకు ఆటోమొబైల్ ఇంజనీరు చార్ల్స్బర్ట్తో వివాహమైంది. అయితే వీరి చిన్నారులకు కనేందుకు బదులు, దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారు 2016లో ముంబైకి చెందిన ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు వీరు ఆకాశ్‌ను దత్తత తీసుకున్నారు. ఈ దత్తత కార్యక్రమం పూర్తయిన అనంతరం బర్ట్ దంపతులు స్థానిక దంతేశ్వరి మాత దర్శనం చేసుకున్నారు.













