ఆ క్యాలెండర్ కు జయ మరణం ముందే తెలుసా!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు ఆ రాష్ట్ర ప్రజలు. అమ్మలేని లోటును ఎవరు పూడ్చగలరు అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇదిలా ఉండగానే మరోవైపు ఓ ఆసక్తికరమైన వార్త తమళనాట సంచలనమయ్యింది. అమ్మ మరణవార్తను ఓ క్యాలెండర్ ముందే చెప్పింది అంటూ చర్చలపై చర్చలు జరుగుతున్నాయి. చెన్నైకి చెందిన ఓ షాప్ యాజమాన్యం ఈ క్యాలెండర్ రూపొందించింది. క్యాలెండర్ లోని ప్రతి పేపర్ పై ఓ సూక్తి రాశారు. అదే ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. జయ మరణాన్ని ప్రకటించిన డిసెంబరు 5వ తేదీ చీటిపై..‘ఓ గదిలో మరణం – పక్క గదిలో వారసత్వం కోసం కొట్లాట’ అని అర్థాన్ని సూచించే వాక్యాలను తమిళంలో ముద్రించారు. తమిళంలో రాసిన ఈ వాక్యాలు అక్షర సత్యం అయ్యాయి. ఐదో తేదీ సాయంత్రం అపోలో హాస్పిటల్ లోని ఐసీయూ రూమ్ లో సీఎం జయలలిత గుండెపోటుకు గురై మృత్యువుకు చేరువలో ఉన్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న గదిలో ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం నాయకత్వంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భేటీ అయ్యి, అమ్మ వారసుడి కోసం చర్చలు జరిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగినా… ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. క్యాలెండర్ వాక్యాలు నిజమయ్యాయంటూ ఆశ్చర్యపోయారు. ఈ క్యాలెండర్ చీటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.













