భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి
ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ నసీం జైదీ స్థానంలో నియమితమైన ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటీఫికేషన్ జారీ చేసింది. జైదీ పదవీకాలం నేటితో ముగియనుంది. 1975 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అచల్ కుమార్ 2013 జనవరిలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా పదవీ విరమణ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎస్‌గా వ్యవహరించారు. గుజరాత్ విజిలెన్స్ కమిషనర్‌గా, కాండ్లా పోర్టు ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మాద నిగమ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, పరిశ్రమలు, రెవెన్యూ, నీటిసరఫరా శాఖల కార్యదర్శిగా పనిచేశారు. పలు ఇతర హోదాల్లోనూ బాధ్యతలు నిర్వహించారు. 21వ సీఈసీగా నియమితమైన అచల్ వచ్చే ఏడాది జనవరి 17వరకు పదవిలో కొనసాగనున్నారు. ఆయనకు 64 ఏళ్లు. నిబంధనల ప్రకారం సీఈసీ, ఎన్నికల కమిషనర్లు గరిష్ఠంగా ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్లు నిండే వరకు పదవిలో కొనసాగుతారు. రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది.













