ఆ పథకానికి ఆధార్ తప్పనిసరి
ఉగ్ర దాడులు, మత కలహాల్లో గాయపడిన వ్యక్తులు లేదా వారి కుటుంబీకులకు కేంద్ర ప్రభుత్వం అందించే పథకం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్ర దాడిలో గాయపడిన వారు లేదా వారి కుటుంబీకులు, నక్సల్ దాడి బాధితులు, మత కలహాల బాధితులు, భారత సరిహద్దుల్లో కాల్పులు, పేలుళ్ల బాధితులు భారత ప్రభుత్వం అందించే పథకానికి అర్హులు కావాలంటే తప్పనిసరిగా తమ ఆధార్ గుర్తింపును సమర్పించాలని సూచించింది. అసోం, మేఘాలయలో తప్ప దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుందని హోమ్ శాఖ ప్రకటించింది. ఆ రెండు రాష్ట్రాలలో ఆధార్ నమోదు ఇంకా పూర్తి కానందున వాటిని ఈ సూచన వర్తించదని తెలిపింది. ఈ సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులకు అందజేస్తాయి. వారి నుంచి కేంద్రానికి ప్రతిపాదన అందినప్పుడు రాష్ట్రాలకు కేంద్రం ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.













