ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో ‘ఆధార్’ గుబులు
ఆధార్ సంఖ్యను పాన్‌తో అనుసంధానం చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని, ప్రభుత్వం వ్యక్తిగత వ్యవహారాల్లోకి తొంగి చూస్తుందని, డేటా మైనింగ్ జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
జూలై 1న లేదా ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేవారు ఆధార్ సంఖ్యను లేదా ఆధార్ దరఖాస్తు సంఖ్యను తప్పనిసరిగా పేర్కొనాలని ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ చెప్తోంది. దీనిని సుప్రీంకోర్టు జూన్ 9న సమర్థించింది. ఆధార్ వ్యక్తిగత గోప్యతను హరిస్తోందా? అనే అంశంపై విచారణ జరుపుతోంది
ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా పాన్‌కు అనుసంధానం చేయాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ చెప్తోంది. ఆ శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిటర్నును దాఖలు చేయాలంటే ఆధార్ సంఖ్యను లేదా ఆధార్ దరఖాస్తు సంఖ్యను తప్పనిసరిగా పేర్కొనాల్సిందే. వార్షికాదాయం రూ.5 లక్షలు కన్నా ఎక్కువ ఉన్నవారు తప్పనిసరిగా ఆన్లైన్లోనే రిటర్నును దాఖలు చేయవలసి ఉంటుంది.
ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికి చాలా మంది కొత్త దారులు వెతుకుతున్నారు. కొందరు జూన్ 30లోగా తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారు. మరికొందరు పన్ను చెల్లింపుదారులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నేరుగా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలకు వెళ్ళి రిటర్నులను ఇచ్చినప్పటికీ, వాటిని ఆమోదించవలసిన కర్తవ్యం అధికారులకు లేదని తెలుస్తోంది. ఒకవేళ ఉన్నతాధికారులను సంప్రదించినా, మాన్యువల్ ఐటీ రిటర్నును దాఖలు చేయడానికి తగిన కారణాలను చెప్పవలసి ఉంటుంది.
ఆధార్ సంఖ్యను పేర్కొనడం నుంచి కొందరికి మినహాయింపులు ఇచ్చారు. 80 ఏళ్ళ వయసు పైబడినవారు, ప్రవాస భారతీయులు, విదేశీ పౌరులు, అస్సాం, జమ్మూ-కశ్మీరు, మేఘాలయవాసులు ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేయనక్కర్లేదు.













