44 మందిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే ప్రక్రియ ప్రారంభం
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 44 మందిని హైకోర్టుల న్యాయమూర్తులుగా నియమించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వీరిలో 29 మంది అలహాబాద్ హైకోర్టుకు చెందిన వారు కాగా ఇద్దరు కర్ణాటక హైకోర్టుకు, ఏడుగురు కలకత్తా హైకోర్టుకు, ఆరుగురు మద్రాసు హైకోర్టుకు చెందిన వారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇవే పేర్లను ప్రభుత్వం గతంలో రెండు సార్లు వెనక్కు పంపింది. కొలీజియం తన సిఫార్సును పునరుద్ఘాటిస్తే ప్రభుత్వం ఆ పేరును పరిశీలనలోకి తీసుకుని నియమించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఇటీవల మోదీ ప్రభుత్వం కొలీజియం సిఫార్సులను ఒకటి కన్నా ఎక్కువసార్లు వెనక్కు పంపి అనామోదాన్ని తెలిపింది. గత వారం బొంబాయి హైకోర్టుకు 14 మంది న్యాయమూర్తులను జమ్ము-కశ్మీరు హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు. మొత్తం 24హైకోర్టుల్లో ఆమోదించిన న్యాయమూర్తుల సంఖ్య 1,079 కాగా 450 మంది కొరత ఉంది.













