బంగారంపై 3 శాతం పన్ను..జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం..!!
బంగారం సహా ఆరు కీలక వస్తువులపై పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 15వ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహించారు. జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలుకు రాష్ట్రాలు అంగీకరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. జీఎస్టీ తదుపరి సమాచారం ఈనెల 11న జరగనుంది. కాగా, ఆరు ముఖ్య వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన కొత్త పన్ను రేట్ల ప్రకారం, బంగారంపై 3 శాతం పన్ను విధిస్తారు.
బంగారం బిస్కట్లపై 18 శాతం పన్ను విధిస్తారు. రిజిస్టర్ ట్రేడ్ మార్క్‌తో అమ్మకం జరిపే ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలపై 5 శాతం పన్ను ఉంటుంది. రూ.500 కంటే తక్కువ ధర ఉండే పాదరక్షలపై 5 శాతం, రూ.500కు పైబడితే 18 శాతం పన్ను ఉంటుంది. సిల్కు, జనపనార వస్తువులపై టాక్స్ ఉండదు. రూ.1000 కంటే తక్కువ ధరకు అమ్మే రెడీమేడ్ దుస్తులపై 5 శాతం పన్ను, రూ.1000 దాటితే 12 శాతం పన్ను ఉంటుంది. సోలార్ ప్యానల్స్‌పై 5 శాతం పన్ను ఉంటుంది. బీడీలపై 28 శాతం పన్ను విధించారు. ఎలాంటి సెస్ ఉండదు. తేయాకు (టెండూ లీవ్స్)పై 18 శాతం పన్ను ఉంటుంది.













