అదే తుది తీర్పు కాదు : సుప్రీం
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం పై గత ఏడాది ఇచ్చినదే తుది తీర్పు కాదని అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమల బయలుదేరిన బిందు అమ్మిని అనే మహిళను అడ్డుకోవడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది ఇచ్చిన తీర్పును కాలరాస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. స్పందించిన ధర్మాసనం 2018లో ఇచ్చినదే తుది తీర్పు కాదని, ఈ అంశాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదలీ చేశామని పేర్కొంది. ఆ బెంచే తుది తీర్పు వెలువరిస్తుందని సూచించింది.
శబరిమలతో పాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై ఈ ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. గత ఏడాది తీర్పుపై ఎటువంటి స్టే ఇవ్వలేదన్న ఇందిరా జైసింగ్ వాదనలను అంగీకరించిన జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గతంలో దాఖలైన మరో పిటిషన్‌తో కలిసి వచ్చే వారం విచారణ చేపడతామని సృష్టం చేసింది.













