నలుగురు దోషులకు మార్చి 3న ఉరిశిక్ష
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారయ్యింది. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఉరి తీయనున్నారు. ఈమేరకు పటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నలుగురు దోషులకు ఉరి శిక్షను అమలు చేసేందుకు ఓ తేదీని నిర్ణయించాలని కోరుతూ ట్రయల్ కోర్టును అధికారులు ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు ట్రయల్ కోర్టు తలుపు తట్టగా కొత్త తేదీ ఖరారు చేసింది. 2012 డిసెంబరు 16న ఢిల్లీలో ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో ముఖేశ్ కుమార్ సింగ్, పవన్, వినయ్, అక్షయ్ దోషులు. వీరికి మరణ శిక్షలు ఖరారయ్యాయి. అయితే వీరు రకరకాల పిటిషన్లతో ఈ శిక్షల అమలులో జాప్యం జరిగేలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలకు చెక్ పెడుతూ ట్రయల్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.













