సేంద్రియ క్షేత్రం సిక్కింకు అత్యున్నత పురస్కారం
సేంద్రియ క్షేత్రం సిక్కింను అత్యున్నత పురస్కారం వరించింది. నూరు శాతం సేంద్రియం గా రికార్డులకెక్కిన ఈ బుల్లి రాష్ట్రానికి అంతర్జాతీయ అవార్డు దక్కింది. సిక్కిం అనుసరిస్తున్న పర్యావరణహిత విధానాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని చెబుతూ, ఐరాస ఆహార, వ్యవసాయ విభాగం ఎఫ్ఏవో ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇటలీలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సహా మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
ప్యూచర్ పాలసీ అవార్డ్ గా నామకరణం చేసిన ఈ పురస్కారాన్నే మేలిమి విధానాలకు ఆస్కార్గా అభివర్ణిస్తుంటారు. దీన్ని గెలుచుకొనేందుకు 25 దేశాలకు చెందిన 51 నామినేషన్లతో సిక్కిం పోటీపడింది. బ్రెజిల్, డెన్మార్క్, ఈక్వెడార్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐరాసకు చెందని ఎఫ్ఏవో, వరల్డ్ ప్యూచర్ కౌన్సిల్ (డబ్ల్యూఎఫ్సీ), ఐఎఫ్వోఏఎం-ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేస్తుంటాయి. సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నట్లు 2003లోనే సిక్కిం అధికారికంగా ప్రకటించింది. సేంద్రియం వైపుగా పడిన అడుగులు రాష్ట్రంలో 66,000 కుటుంబాల్లో వెలుగులు నింపాయి.













