800 కోట్లకు చేరిన జనాభా..! సంబరాలు చేసుకునే సమయమా..?
కాలం మారుతోంది.. దానికి తగ్గట్టే ప్రపంచం కూడా.. జనాభా కూడా..! జనాభా అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రపంచ జనాభా 800 కోట్లు. విశ్వంలో అత్యంత తెలివైన జీవి మానవుడు. మానవుల జనాభా పెరిగిపోతోందని .. మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ఓ వైపు ఆనందం.! మరోవైపు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సహజ వనరులు అభివృద్ధి చెందకపోగా కృశించుకుపోతున్నాయి.. ఇదే అత్యంత బాధాకరం..!! తాజాగా ప్రపంచ జనాభా మరో మైల్ స్టోన్ దాటింది. 800 కోట్ల మార్క్ ని చేరుకుంది. మానవాళి చాలా వేగంగా పెరుగుతోంది. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందడం, శిశు మరణాలు తగ్గడం, ఆయుర్దాయం పెరగడం.. లాంటి అనేక అంశాలు మానవాళి పెరగడానికి దోహదపడుతున్నాయి.
ఇప్పటి వరకూ జనాభాలో చైనాదే అగ్రస్థానం. అయితే చైనా ఇప్పటికీ జనాభా నియంత్రణ అమల్లో ఉంది. కాస్త సడలింపులు ఉన్నా.. ఇప్పటికే ఆ దేశానిదే ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ లో భారత్ ఉంది. ప్రస్తుతం మన జనాభా 141కోట్లకు పైమాటే. అయితే 2050 నాటికి మన దేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అప్పుడు చైనాను మించిపోతామని ఐక్యరాజ్యసమితి చెప్తోంది. చైనాలో కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడంతో ప్రస్తుతం జననాల రేటు భారీగా తగ్గింది. ఈ శతాబ్దం చవరి నాటికి చైనా జనాభా మరింత తగ్గుతుందని అంచనా. మన దేశంలో కుటుంబ నియంత్రణపై కఠిన నిబంధనలు అమల్లో లేవు. అందుకే జనాభా పెరిగిపోతోంది. అదే జరిగితే 2050 నాటికి ఫస్ట్ ప్లేస్ లో భారత్, రెండో స్థానంలో చైనా ఉంటాయి. అమెరికా, పాకిస్తాన్, ఇండోనేషియా, బ్రెజిల్.. తర్వాతి స్థానాల్లో నిలుస్తాయి.
జనాభా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇది ఎంతవరకూ పెరుగుతుందనే దానిపైనా అనేక అంచనాలు ఉన్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి జనాభా 1040 కోట్లకు చేరుతుందని ఐరాస అంచనా వేస్తోంది. ఆ తర్వాత పెద్దగా పురోగతి ఉండకపోవచ్చని లెక్కగడుతున్నారు. అంతేకాదు.. పురుషులు, మహిళల నిష్పత్తి కూడా ఇప్పుడున్నట్టు వ్యత్యాసం కాకుండా సమానస్థాయికి చేరుతుందని చెప్తున్నారు. జనాభా పెరుగుదలకు సంబంధించి మరో అంచనా కూడా ఉంది. 2100 సంవత్సరాని కంటే ముందుగానే జనాభా 1040 కోట్లకు చేరొచ్చని కూడా చెప్తున్నారు.
జనాభా పెరుగుతూనే ఉంటుందా.. దీనికి బ్రేక్ పడదా.. అనే సందేహాలు కూడా లేకపోలేదు. అయితే ఇన్నేళ్లలో తొలిసారి 2020లో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. కరోనా వల్ల, సోషల్ డిస్టన్స్ వల్ల.. ఇది జరిగిందని చెబుతున్నారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ లోని కొన్ని ప్రాంతాల్లో సంతోనోత్పత్తి తగ్గడం కూడా ఇందుకు ఒక కారమమని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే.. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా క్షీణత కనిపించడం. ఇక్కడ ప్రతి మహిళ సగటున 2.1 మందిని కంటోంది.. ఇది 2050 నాటికి 1కి పడిపోతుందని అంచనా. చైనా కూడా ఇదే బాటలో పయనిస్తోంది. అందుకే అక్కడ జననాల రేటు బాగా పడిపోతోంది. ఇక ప్రపంచ సగటు ఆయుర్దాయం 2050 నాటికి 77 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు.
ఇలా జనాభా పెరిగిపోతున్న కొద్దీ ఈ ప్రపంచం ఏమైపోతుందోననే ఆందోళన ఎక్కువ అవుతోంది. ఎందుకంటే జనాభాకు తగ్గట్టు భూమి పెరగదు.. సహజ వనరులు పెరగవు.. పైగా తరక్కుపోతున్నాయి. ఇది ఆహార సంక్షోభానికి దారి తీస్తుందననే భయం వ్యక్తమవుతోంది. మనం తినే తిండి పూర్తిగా సహజవనరులపైనే ఆధారపడి ఉంటోంది. ఇప్పటికే అడవులు హరించుకుపోతున్నాయి. భూతాపం పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. కరోనా లాంటి వింత జబ్బులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానవ జనాభాని అదుపులో ఉంచుకోవడంతో పాటు.. సహజవనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే బతుకు భారమే..!













