భారత్ నౌకలపై అమెరికా దాడులు.. తీవ్రంగా స్పందించిన మోడీ సర్కార్..!
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై దాడుల వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ దాడులు చేసింది అమెరికానే అని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే దీన్ని ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులు చేసింది తాము కాదన్నారు. హర్మూజ్ జలసంధిని వీడుతున్న భారత నౌకలపై ఇరానే డ్రోన్లతో గురువారం దాడులకు తెగబడిందని.. అది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ‘ట్రూత్ సోషల్’లో పోస్టు పెట్టారు.
ట్రంప్ ప్రకటన కంటే ముందు.. వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను భారత్ మరోసారి తీవ్రంగా ఖండించింది. అలాంటి ప్రాణాంతక దాడులు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కావని పేర్కొంది. ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్ను .. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి పిలిపించుకొని నిరసన తెలిపింది. అమెరికా దాడులతో అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య భద్రత, స్థిరత్వానికి ముప్పు ఎదురవుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆందోళనలను అమెరికా నాయకత్వాన్ని తెలియజేయాలని.. ప్రాణనష్టాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని మీక్స్ను కోరింది. ఆయనకు భారత్ బుధవారం రాత్రి కూడా సమన్లు జారీ చేసింది.
భారతీయ నావికులున్న నౌకలపై అమెరికా దాడులను ఇరాన్ ఖండించింది. ఆ దాడులు అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తాయని పేర్కొంది. ముగ్గురు భారతీయుల మరణానికి అమెరికాను జవాబుదారీగా చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయీల్ బఘాయీ ‘ఎక్స్’లో ఈ మేరకు పోస్టు పెట్టారు. భారతీయ నావికులున్న నౌకలపై అమెరికా దాడులను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఖండించారు.
ఒమన్ తీరంలో భారతీయులున్న మూడు వాణిజ్య నౌకలపై ఈ వారంలో దాడులు జరగ్గా.. ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురును రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ఆ నౌకలపై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ప్రకటించింది. అయినప్పటికీ ట్రంప్ ఇప్పుడు అందుకు భిన్నమైన ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.








