హామీల్లో.. ఈ హామీలు వేరయా..!
ఎన్నికల సమయంలో నేతలు హామీలివ్వడం మామూలే. ఉచితంగా బియ్యమిస్తాని, కుక్కర్లు ఇస్తామని.. ఇలా ఏవేవో చెప్తుంటారు. జనం నమ్మితే ఓట్లేసి గెలిపిస్తారు.. గెలిచిన తర్వాత నేతలు ఆ హామీలు నెరవేరుస్తారా.. హ్యాండిస్తారా.. అనేది వేరే సంగతి. అప్పుడు వాళ్లు నేరవేర్చినా.. లేకపోయినా.. అడిగేందుకు వీలుండట్లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో. అందుకే అలవికాని హామీలతో నేతలు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. తాజాగా తమిళనాడులో ఓ స్వతంత్ర్య అభ్యర్థి ఇచ్చిన హామీలు చూసి దేశం మొత్తం నివ్వెరపోతోంది.
తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. అదే కోవలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తాము గెలిస్తే ఏం చేస్తామో కరపత్రం రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే.. దక్షిణ మధురై నుంచి పోటీ చేస్తున్న శరవణన్ అనే స్వతంత్ర అభ్యర్థి కూడా తన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. తాను గెలిస్తే ఏం చేస్తాడో ప్రజలకు చాలా క్లియర్ గా చెప్పాడు. అది చూసి ఓటర్లందరూ షాక్ కు గురవుతున్నారు.
ఇంతకూ శరవణన్ మేనిఫెస్టోలో ఏముందో తెలుసా.. తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఓ ఐఫోన్, కారు, హెలికాప్టర్, రోబో ఇస్తానని ప్రామిస్ చేశాడు శరవణన్. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ ఉన్న మూడంతస్తుల ఇంటిని ఇస్తానన్నాడు. యువతకు కోటి రూపాయల నగదు పంపిణీ చేస్తానన్నాడు. అంతేకాక.. వంద రోజుల పాటు చంద్రుడి మీదకు టూర్ తీసుకెళ్తానని చెప్పాడు. మధురైలో స్పేస్ రీసర్చ్ సెంటర్, రాకెట్ లాంచ్ సైట్, ఆర్టిఫీషియల్ ఐస్బర్గ్ ను ఏర్పాటు చేస్తానని ప్రామిస్ చేశాడు.
అయితే.. శరవణన్ అలవికాని హామీల వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఇవన్నీ ఆచరణ సాధ్యం కావనే విషయం తనకూ తెలుసని.. అయితే ఎన్నికల సమయంలో నేతలు ఇలాంటి హామీలిచ్చి మర్చిపోతుంటారని.. వాళ్లకు ఓసారి తమ హామీలు గుర్తు చేసేందుకే తాను ఇలాంటి హామీలిచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు. దీన్ని చూసి శరవణన్ తెలివైనోడు అంటూ మెచ్చుకుంటున్నారు. ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకే తాను ఇలాంటి మేనిఫెస్టో తీసుకొచ్చినట్లు చెప్పి అందరిచేతా శెభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇక మొదకురిచి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ సరస్వతి కూడా వినూత్న హామీలిచ్చారు. నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువగా మోకాలి నొప్పులతో బాధపడుతున్నట్లు తనకు తెలిసిందని, తనను గెలిపిస్తే ఉచితంగా మోకాలి చికిత్స ఫ్రీగా చేయిస్తానని ఆమె మాటిచ్చారు. అంతేకాదు జల్లికట్టు కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబమ్ కు జాతీయ గుర్తింపు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఒక జాతీయ పార్టీ అభ్యర్థి మేనిఫెస్టోను కాదని.. ఇలా హామీలివ్వడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.













