మరో అడుగు…
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను గద్దె దింపేందుకు రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పీఠం నుంచి నరేంద్ర మోదీని దించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యే దిశగా అడుగులేస్తున్నాయి. దీనిలో భాగంగా మోదీని ఎదుర్కొనేందుకు రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నాయి. బిహార్ రాజధాని పట్నా.. ఈ కార్యక్రమానికి వేదికగా మారింది.2024 ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా చర్చ జరగనుంది.నితీశ్ కుమార్ నివాసం నెక్ సంవాద్ కక్ష్లో జరిగే ఈకార్యక్రమానికి దేశంలోని 15 పార్టీలకు సంబంధించిన అధినేతలు, ముఖ్యనేతలు పాల్గొంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
2024 ఎన్నికల్లో కూటమిగా పోటీచేయాలని భావిస్తున్న విపక్షాలు.. ఈ సమావేశాన్ని కీలక ముందడుగుగా భావిస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాని అభ్యర్థిపై చర్చ రాదని చెబుతున్నాయి.భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంతో ఈ ప్రతిపక్షాల భేటీ కొనసాగనుంది. విపక్షాల ఐక్యత కోసం.. భవిష్యత్లో నిర్వహించబోయే సమావేశాలకు ఈ భేటీ తొలి అడుగు అని వివిధ పార్టీల నేతలు తెలిపారు.
ప్రధానంగా నాలుగు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విషయంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా దేశ ప్రజలకు తెలియజేయాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులను పక్కన పెట్టి.. బీజేపీపై ఉమ్మడి పోరాటం సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు.. పార్టీలు సహకరించుకునేలా చర్చలు జరపనున్నారు.
బీజేపీ బలం లేని చోట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీల మధ్య పోరు ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఎలా ముందుకు సాగాలి అన్నదానిపై భేటీలో చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు గట్టి పోటీని ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కొన్ని చోట్ల త్యాగాలు చేయాల్సి వస్తుందని పలువురు నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఒప్పించే ప్రయత్నాలు కూడా ఈ భేటీలో జరగనున్నట్లు తెలుస్తోంది.













