విపక్షాల దేశ్ కీ నేత – నితీశ్ కుమార్ కాబోతున్నారా?
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ తో పాటు కేసీఆర్, నితీశ్ కుమార్, కేజ్రివాల్ తదితరులు కూడా బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. మమత బెనర్జీ కూడా ఆ మధ్య బీజేపీపై సమరశంఖం పూరించింది. అయితే ఈ మధ్య ఆ ఊసు ఎత్తట్లేదు. దీంతో ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.
ఈ మధ్యకాలంలో దేశంలోని మెజారిటీ పార్టీలు బీజేపీతో కలిసి నడుస్తున్నాయి. కేంద్రంలో పటిష్టంగా ఉండడం.. మెజారిటీ రాష్ట్రాలు ఆ పార్టీ చేతుల్లోనే ఉండడం ఇందుకు కారణం. అయితే ఇందుకు విరుద్ధంగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుంటే.. నితీశ్ కుమార్ ఆ పార్టీని గట్టి దెబ్బ కొట్టారు. దీంతో అందరి చూపూ నితీశ్ పై పడింది.
ఇన్నాళ్లూ బీజేపీపై పెద్దగా నోరు మెదపని నితీశ్ కుమార్.. ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు. సాధారణంగా నితీశ్ కుమార్ బీహార్ దాటి బయటకు రారు. మిగిలిన పార్టీలతో పెద్దగా కలవరు. బీహార్ కు సీఎంగా ఉంటే చాలు.. అంతకు మించి తనకు పెద్ద కోరికలు లేవని చెప్తుంటారు. కానీ తొలిసారి ఆయన బీహార్ వదిలి ఢిల్లీ పీఠంపై కన్నేసినట్లు అర్థమవుతోంది. బీహార్ లో బీజేపీని వదిలేసి కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన నితీశ్.. పలువురు విపక్ష పార్టీల నేతలతో భేటీ అయ్యారు. ఇది తీవ్ర ఆసక్తి కలిగిస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకే నితీశ్ కుమార్ ఈ పని చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీని చూసీచూడనట్లు వదిలేస్తే అందర్నీ కబళించి వేస్తుందనే భయం ఇప్పుడు నితీశ్ కు కూడా పట్టుకుంది. బీహార్ లో తనకు వ్యతిరేకంగా మరో ఏక్ నాథ్ షిండేను తయారు చేస్తున్నారని గుర్తించిన నితీశ్.. వెంటనే మేల్కొని బీజేపీతో కటీఫ్ చెప్పి బయటపడ్డారు. లేకుంటే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేదే. నితీశ్ తృటిలో తప్పించుకున్నారు. అందుకే నితీశ్.. ఇప్పుడు బీజేపీపై యుద్ధం ప్రకటించారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్నారు.
మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో నితీశ్ కుమార్ పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆప్ అధినేత కేజ్రివాల్, ఐఎన్ఎల్డీ అధినేత ఓంప్రకాశ్ చౌతాలా, సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. తదితరులతో నితీశ్ కుమార్ సమావేశమై చర్చలు జరిపారు. వీళ్లంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నవాళ్లే. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్ ప్రయత్నాలు చేస్తున్నారని జాతీయ మీడియా అంచనా వేస్తోంది.
కేసీఆర్ ఇటీవలే బీహార్ వెళ్లి నితీశ్ కుమార్ తో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని.. ఢిల్లీలో వచ్చేది బీజేపీయేతర ప్రభుత్వమేనని ప్రకటించారు. దీంతో నితీశ్, కేసీఆర్ తదితరులంతా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడతారని భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే హిందీ రాష్ట్రాల్లో కేసీఆర్ కంటే నితీశ్ కుమార్ కే పట్టు ఎక్కువ. అందుకే నితీశ్ కుమార్ ను ముందుంచి ఈ గేమ్ ఆడాలని కేసీఅర్ భావించి ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే దేశ్ కీ నేత నితీశ్ కుమార్ కావడం ఖాయమని చెప్పొచ్చు.













