కాంగ్రెస్ ‘కోట’లో తుపాను….
రాజస్థాన్ కాంగ్రెస్ లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఓవైపు మరికొన్ని నెలల్లో ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో.. మరోసారి సీఎం గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్య విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గత వసుంధరా రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోలేదంటూ నేరుగా పైలట్.. గెహ్లోత్ సర్కార్ పై విమర్శలు చేశారు. ఐదు రోజుల జన్ సంఘర్ష్ యాత్ర ముగింపు సందర్భంగా .. అవినీతిపై గెహ్లోత్, నేను పోరాటం చేస్తున్నామంటూనే.. అవినీతిపై చర్యల్లేవని తేల్చేశారు. దీనిపై గెహ్లోత్ కూడా అంతే ఘాటుగా రియాక్టయ్యారు. ఎక్కడ అవినీతిపై చర్యల్లేవంటూ పరోక్షంగా పైలట్ ను ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో గెహ్లోత్, పైలట్ జోడెద్దుల్లా కాంగ్రెస్ ను ముందుండి నడిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం పదవికోసం పోరాటం చేశారు. అయితే అంతకుముందే పంజాబ్ లోసిద్ధూ కారణంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ తో పాటు ఎన్నికల్లో విజయాన్ని దూరం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఈసారి ఎవరి బలమెంతో తేలేవరకూ ఆగింది. అధికశాతం ఎమ్మెల్యేలు.. గెహ్లోత్ వైపు ఉండడంతో.. సచిన్ పైలట్ కు మరో అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత ఇరువురు నేతల మధ్య రాజీకుదర్చడంలో సఫలమైంది హైకమాండ్
మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో మరోసారి అవినీతి ఆరోపణల తేనెతుట్టే కదిల్చారు సచిన్ పైలట్. అయితే పైలట్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నప్పటికీ.. వసుందరా రాజే నిర్ణయాలు ముఖ్యంగా పేపర్ లీకేజి ఘటనలపై మాత్రం చర్యలకు గెహ్లోత్ సిద్దంగా లేరు. ఎందుకంటే వాటిని కదిలిస్తే.. అవి ఎటుపోయి ఎటు వెళ్తాయో తెలియదు. మళ్లీ రాజకీయంగా అలజడులు రేగితే తన కుర్చీకిందకు నీళ్లొచ్చే ప్రమాదముందని సీనియర్ రాజకీయనాయకుడైన గెహ్లోత్ కు తెలియంది కాదు. అందుకే విపక్ష బీజేపీ సర్కార్ చేసిన నిర్ణయాలపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించడం లేదు
అయితే గత ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా వసుంధరా రాజే అవినీతిపై ఊరూరా సచిన్ పైలట్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అవినీతి సర్కారంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మళ్లీ ఈసారి ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఆ కారణంగానే పైలట్ మరోసారి.. అవినీతి తేనెతుట్టెను కదిపారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఓవేళ ఎన్నికల్లో ప్రచారం చేసే సమయంలోనూ.. తాను అవినీతికి పూర్తి వ్యతిరేకమంటూ ప్రజల్లోకి వెళ్లే అవకాముందంటున్నారు. గెహ్లోత్ కారణంగా చర్యల్లేవని నెపం నెట్టేసే అవకాశాన్ని సృష్టించుకున్నారు. గెలిస్తే మరోసారి అధికారం కోసం ఇరువురు నేతలు ఢీ అంటే ఢీ అనే అవకాశాలు కనిపిస్తున్నాయి.













