విపక్షాల ఐక్యత దిశగా..?
కర్నాటకలో కాంగ్రెస్ భారీవిజయంతో ఆపార్టీకి మిగిలిన మిత్రపక్షాల్లో క్రెడిబులిటీ వచ్చింది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పనైపోయిందని చులకన చేసిన మాట్లాడిన మమత, ఆప్ లాంటి పార్టీలు.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైపు చూస్తున్నాయి. అంతే కాదు.. ఈ విజయంతో నియంతృత్వ బీజేపీని ఓడించగల సత్తా విపక్షాలకు ఉందని రుజువైందని అంటున్నాయి. ఇదే ఊపు కనబరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం ఖాయమంటున్నాయి. ఇందుకోసం ఓ కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచిస్తున్నాయి.
కొద్దికాలంగా బిహార్ సిఎం నితీష్ కుమార్.. విపక్షాల ఐక్యత కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. వరుసగా విపక్ష నేతలను కలుస్తూ..అందరినీ ఓ కామన్ ఫ్లాట్ ఫామ్ పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మమత, పవార్, ఉద్దవ్, తేజస్వీయాదవ్ సహా పలువురు విపక్షనేతలను కలిశారు. తెలంగాణ సీఎంను కూడా త్వరలో కలిసే అవకాశముంది. ఎక్కడ ఏపార్టీ అధికారంలో ఉంటే, ఆపార్టీతో తమకున్న బలాన్ని బట్టి మిగిలిన పార్టీలు పొత్తు పెట్టుకునేదిశగా అడుగులు వేసేదిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈప్రయత్నాలు మరింతముమ్మరం కానున్నాయి.
గతంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత… బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కలసికట్టుగా పోరాడాల్సి ఉందన్నారు. అంతే కాదు.. అందుకు ఆయన ఓ ప్రతిపాదన సైతం తెరపైకి తెచ్చారు. ఎక్కడ ఏపార్టీ బలంగా ఉంటే, అక్కడ ఆపార్టీకి మిగిలిన పార్టీలు మద్దతివ్వాలన్నారు. అందువల్ల బీజేపీతో విపక్షాల అభ్యర్థి నేరుగా తలపడే అవకాశముందన్నారు. అయితే ఆ సమయంలో పెద్దగా దాన్ని ఏ నాయకుడు పట్టించుకోలేదు.
కన్నడ సీమలో హస్తం విజయం తర్వాత మిగిలిన విపక్షాల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. మొన్నటివరకూ తమకు మద్దతివ్వాలని చెబుతూ వస్తున్న విపక్షనేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు ముందుకొస్తున్నాయి.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీకి మద్దతిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమ తా బెనర్జీ ప్రకటించారు. అయితే, వేరే రాజకీయ పార్టీ లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూడా అదే పని చేయాలని ఆకాంక్షించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని చెప్పడం ద్వారా.. విపక్షాల కూటమిలో టీఎంసీ కూడా ఉండబోతున్నట్లు మొదటిసారిగా స్పష్టత ఇచ్చారు.
మరోవైపు మోదీ ప్రభంజనం ముగిసిందని ఎన్సీపీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. ప్రతిపక్షాల ప్రభంజనం దేశవ్యాప్తంగా వీస్తోందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం తమ సన్నాహాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో లోక్సభ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నామని తెలిపారు.కర్ణాటకలో బీజేపీ ఓటమినిబట్టి నియంతృత్వాన్ని ప్రజలు ఓడించగలరని స్పష్టమవుతోందన్నారు.













