మోడీ వ్యాఖ్యలతో ముస్లిం ఓటు బ్యాంకు షిఫ్టవుతోందా…?

ముస్లింకోటా రిజర్వేషన్లపై మోడీ చేసిన వ్యాఖ్యలు … ఆ సమాజంలో ఓరకమైన అభద్రతను కనబరిచినట్లు కనిపిస్తోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్, ఇతర విపక్షాల వెన్నంటి ఉన్న ఆయావర్గాలు.. దశాబ్దకాలంగా మోడీవైపు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లపై మోడీ వ్యాఖ్యలు… ఓటుబ్యాంకుపైనా పడుతున్న అంచనాలున్నాయి. హిందూ ఓటుబ్యాంకును మరింత పటిష్టం చేసుకునేందుకు కొన్నేళ్లుగా ప్రయాసపడుతున్న ప్రధానమంత్రి మోడీ.. దానిలో భాగంగా ముస్లిం కోటా రిజర్వేషన్లు, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హిందూ సంపదను వారికి దోచిపెడుతుందన్నట్లుగా మాట్లాడారు. దీంతో హిందువులు సంఘటితంగా తమకే ఓటేస్తారని మోడీ భావించినట్లు కనిపిస్తోంది.
అయితే.. హిందువులు ఎలానూ బీజేపీవైపే ఉన్నారు. ఓవైపు మోడీ, మరోవైపు యోగీ.. తమ చరిష్మాతో హిందు ఓటుబ్యాంకును గుప్పిటపెట్టుకున్నారు.కానీ ఇటీవలికాలంలో తమవైపు వస్తున్న ముస్లిం సమాజాన్ని ఒక్క కామెంట్ తో మోడీ దూరం చేసుకున్నారా అన్న చర్చ బీజేపీలోనూ అంతర్గతంగా నడుస్తోంది. ఇది తమకు వచ్చే ఓట్లను దూరం చేసే ప్రమాదముందన్నది కమలనాథుల ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. ఇంతకన్నా కాంగ్రెస్ కు ఇది వరమయ్యే అవకాశాలున్నాయని మరికొందరు బీజేపీనేతలు భావిస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. మరోసారి హస్తం వైపు మొగ్గేఛాన్స్ కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే రాహుల్, కాంగ్రెస్ ప్రణాళికలు సైతం ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని గుర్తించిన మోడీ అండ్ టీమ్… దాన్ని కవర్ చేసేలా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే మోడీ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వరుసగా వివరణలు సైతం ఇస్తున్నారు.పవిత్ర రంజాన్ మాసంలో గాజాపై వైమానిక దాడులను నిలిపివేయాలని తన ప్రతినిధి ద్వారా ఇజ్రాయెల్‌కు సందేశం పంపానని ప్రధాని మోడీ తెలిపారు. ఆయన ఓ హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘రంజాన్ మాసంలో నా ప్రత్యేక ప్రతినిధిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వద్దకు పంపించాను. ఆ పవిత్రమాసంలో బాంబింగ్ చేయవద్దన్న నా సందేశాన్ని ఆయనకు చేరవేశాడు. వారు కూడా దానిని పాటించడానికే యత్నించారు. కానీ, చివరి రెండు మూడు రోజుల్లో ఘర్షణ జరిగింది. ముస్లింల అంశాలపై తనను ఇబ్బంది పెట్టినా.. ఇటువంటి విషయాలను వెంటనే బహిర్గతం చేయను’’ అని వెల్లడించారు.
హిందూ-ముస్లిం రాజకీయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. వారి బుజ్జగింపు రాజకీయాలను బయటపెడుతున్నందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, హిందూ-ముస్లిం అంటూ తేడా చూపించిన రోజున ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తాను ఎప్పటికీ మస్లింలకు వ్యతిరేకం కాదని, కావాలని తన మాటలను వక్రీకరించారని అన్నారు. “నేనెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్‌ను నేను బలంగా నమ్ముతాను. పేదల అభివృద్ధి కోసం పాటుపడతాను. అందుకే అధిక సంతానం గురించి మాట్లాడాను. కానీ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. అది చూసి ఆశ్చర్యపోయా. నిజానికి ఎక్కువ మంది పిల్లలను ముస్లింలే కాదు, నిరుపేదలు కూడా కంటారు. కానీ వాళ్లను పెంచడం వాళ్లకు తలకు మించిన ఇబ్బందే కదా. ఏ వర్గం అయినా సరే వారు చూసుకోగలిగినంత సంతానాన్నే కనాలి కానీ, ప్రభుత్వంపై భారం పడేంత కాదు. అదే నేను చెప్పాను” అంటూ మోడీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
అంతేకాకుండా తన చిన్నప్పుడు ముస్లింలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవని, తనకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు కూడా ఉన్నారని అన్నారు. ఈద్ రోజున ముస్లిం స్నేహితులే తనకు అన్నం పెట్టేవారని, తానెప్పుడూ హిందూ-ముస్లిం అంటూ తేడా చూపనని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను అలా చూపిస్తే ఆ రోజున ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదని ప్రధాని మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.