‘మరాఠా’ ఫైట్..
ఎన్సీపీ చీలిక, పార్టీ తమదేనని అజిత్ పవార్ ప్రకటించడంతో శరద్ పవార్ అప్రమత్తమయ్యారు. పార్టీ, గుర్తు తమదేనన్నారు. అంతేకాదు.. అజిత్ వర్గం పార్టీకి ద్రోహం చేసిందని, తనకు వెన్నుపోటు పొడిచారంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ముందుగా చెప్పినట్లుగా నాసిక్ నుంచి ఈప్రచారాన్ని ప్రారంభించారు శరద్ పవార్. కొంతమందిని నమ్మి తప్పు చేశానని.. ఎవరినీ నమ్మకూడదన్నారు.
తాను ఇంకా అలసిపోలేదని… కార్యకర్తలు తనను పని చేయాలని కోరుకుంటున్నారని అజిత్‌కు కౌంటర్ ఇచ్చారు శరద్ పవార్.. . ‘‘మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా..? నాకు ప్రధానమంత్రి లేదా మంత్రి కావాలని లేదు. కానీ, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నానన్నారు. అంతేకాదు.. పార్టీలో వెన్నుపోటు దారులకు చోటు లేదన్నారు శరద్.
తనకు పనిచేసే శక్తి ఉందని చెప్పుకొచ్చారు శరద్ పవార్. ‘‘నేను అలసిపోను… రిటైర్ కూడా కాను’’.. అని అటల్ బిహారీ వాజపేయి మాటలను పవార్ గుర్తు చేశారు. తనను రిటైర్ కావాలని చెప్పడానికి అజిత్ ఎవరు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతే కాదు… సుప్రియా సూలేకు పదవులన్నీ కట్టబెట్టారన్న మాజీకేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్ విమర్శలకు శరద్ పవార్ కౌంటరిచ్చారు. సుప్రియా లోక్ సభ ఎన్నికల్లో గెలిచి వచ్చారన్నారు. ప్రఫుల్ పటేల్ కు కేంద్రమంత్రిగా పదేళ్లపాటు అవకాశమిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో లేని సమయంలో పార్టీలోనూ ప్రఫుల్ పటేల్ కు సముచిత స్థానం కేటాయించామన్నారు. పార్టీ ఇంత చేసినా కూడా …ఆయన పార్టీకి ద్రోహం చేశారన్నారు.
మరోవైపు ఈవ్యవహారమంతా మోడీ కనుసన్నల్లోనే నడిచిందని ఇప్పటికే చెప్పిన పవార్… వెన్నుపోటుదారులందరూ ఫలితం అనుభవిస్తారన్నారు. దీన్ని తాను అంత తేలిగ్గా వదలబోనని స్పష్టం చేశారు. మహావికాస్ అగాడీ కూటమి కలిసికట్టుగా యాత్రలు చేద్దామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. దానిపై ఓ వైపు చర్చలు జరుగుతుండగానే… శరద్ పవార్ ప్రజల బాట పట్టారు. అజిత్ పవార్ వర్గం చేసిన ద్రోహం, బీజేపీ కుయుక్తులను ఎండగడుతూ ముందుకెళ్తున్నారు శరద్.













