కొత్త ప్రభుత్వానికి వేళాయె.. మోడీ సర్కార్ 3.0

సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించడంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోడీ సిద్ధమయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 9వ తేదీన మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ఎన్డీయే కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ అయి, ప్రస్తుత లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. తర్వాత జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతల కీలక సమావేశంలో…మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం జరగనున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీయే కొత్త ఎంపీలతో కలిసి మోడీ.. రాష్ట్రపతిని కలవనున్నారు.
కేబినెట్ సమావేశం అనంతరం ప్రధాని మోడీ తన మంత్రిమండలితో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవుల్లో కొనసాగాలని మోడీ టీమ్‌ను కోరారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించగా…99 స్థానాలతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు (272)ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.