బెంగాల్లో సోలోగా దీదీ ఫైట్…
మిత్రపక్షాలను హ్యాండిల్ చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం మరోసారి బయటపడింది. మొదటి నుంచి ఇండియా అలయెన్స్ లో ఉన్నామని చెప్పిన మమతా బెనర్జీ సైతం.. ఇప్పుడు బెంగాల్ లో ఏకపక్షంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా 42 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు. కాంగ్రెస్ ఏడెనిమిది పార్లమెంటు స్థానాలను ఆశించగా, మమత మాత్రం 2,3 స్థానాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ తీరు నచ్చని మమతాబెనర్జీ.. ఏకపక్షంగా పోటీకి సిద్ధమయ్యారు.
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఏకపక్షంగా 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలిపారు.
ఎలాంటి ఒప్పందమైనా సంప్రదింపుల ద్వారా, గౌరవప్రదంగా ఖరారు కావాలని, ఏకపక్షంగా ఉండరాదని కాంగ్రెస్ పార్టీ మొదట్నించీ చెబుతోంది. బీజేపీతో ఇండియా కూటమి సమష్టిగా పోరాటం చేయాలనే కాంగ్రెస్ కోరుకుంటోంది. పశ్చిమబెంగాల్లో ఇండియా బ్లాక్ బలపడాలన్నదే మా పార్టీ ఉద్దేశం. కూటమితోనే ఉన్నామని, బీజేపీని బెంగాల్లో ఓడించాలని మమతా బెనర్జీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు అన్ని లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించారు. టీఎంసీపై ఎలాంటి ఒత్తిడి పనిచేసిందో నాకు తెలియదు. ఏం జరుగుతుందో చూద్దాం” అని జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసే 42 మంది అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రకటించడంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ రాజకీయనాయకుడు కానీ, పార్టీ కానీ ఆమెను విశ్వసించలేరనే విషయాన్ని మమతా బెనర్జీ నిరూపించుకున్నారని అన్నారు. జాబితా ప్రకటనతో తాను ‘ఇండియా’ కూటమితో లేననే స్పష్టమైన సంకేతాలను పీఎంఓ కార్యాలయానికి పంపారని వ్యాఖ్యానించారు. టీఎంసీ అభ్యర్థుల జాబితాలో అధీర్ రంజన్ నియోజకవర్గమైన బహరాంపూర్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను ప్రకటించడంపై ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనికి మమత సైతం గట్టిగా కౌంటరిచ్చారు. బెంగాల్లో రాహుల్ న్యాయయాత్రకు తనకు ఆహ్వానం లేదన్న విషయాన్ని మమత ప్రస్తావించారు.













