West Bengal: మమతా వర్సెస్ సువెందు, కలకత్తా వీధుల్లో ఎలక్షన్ వార్..!
పశ్చిమ బెంగాల్ (West Bengal)ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపధ్యంలో.. ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో మమతా బెనర్జీ(Mamata Banerjee) వర్సెస్ సువేందు అధికారి(Suvendu Adhikari) మధ్య పోరు అంటేనే ఒక హై-వోల్టేజ్ డ్రామా. నందిగ్రామ్ వేదికగా మొదలైన ఈ యుద్ధం, ఇప్పుడు బెంగాల్ రాజధాని కోల్‌కతా వీధులకు చేరుకుంది. ‘దీదీ’కి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా ఉండి, ఇప్పుడు ఆమెకు బద్ధశత్రువుగా మారిన సువేందు అధికారి, కోల్‌కతా కోటలో మమతను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు.
బెంగాల్ రాజకీయాలు అంటేనే ఎప్పుడూ హాట్ హాట్ గా నడుస్తూ ఉంటాయి. కానీ, గత కొంతకాలంగా మమతా బెనర్జీ (TMC) మరియు సువేందు అధికారి (BJP) మధ్య సాగుతున్న వైరం కేవలం రాజకీయ పోరు మాత్రమే కాదు, అది ఒక పర్సనల్ వార్‌గా మారిపోయింది. ఒకప్పుడు తల్లీకొడుకుల లాంటి బంధం ఉన్న వీరిద్దరి మధ్య.. ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ వేదికగా జరిగిన పోరులో సువేందు అధికారి గెలిచి మమతను ఓడించారు. అప్పటి నుండి వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.
ఇవి కూడా చదవండి
ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు, జిల్లాలకు పరిమితమైన ఈ గొడవ, ఇప్పుడు రాష్ట్ర రాజధాని కోల్‌కతా(Kolkata) కేంద్రంగా సాగుతోంది. అసెంబ్లీ లోపల, బయట కూడా సువేందు ప్రతి అడుగులోనూ మమత సర్కార్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోల్‌కతా ఎప్పుడూ మమతా బెనర్జీకి బలమైన కోట. అయితే, ఇటీవల నగరంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు.. ఉదాహరణకు ఆర్జీ కర్ హాస్పిటల్ ఘటన, అవినీతి ఆరోపణలను అస్త్రంగా చేసుకుని సువేందు అధికారి కోల్‌కతా వీధుల్లో ఆందోళనలు ఉధృతం చేశారు.
కోల్‌కతాలో శాంతిభద్రతల అంశాన్ని సువేందు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కోల్‌కతా హైకోర్టు వేదికగా మమత ప్రభుత్వంపై సువేందు వరుస పిటిషన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తనను నమ్మించి ద్రోహం చేశాడని సువేందుపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కోల్‌కతాలో బీజేపీ పట్టు పెంచుకోకుండా ఉండేందుకు ఆమె తన క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. సువేందును కేవలం ఒక ‘బిజెపి నాయకుడి’గా కాకుండా, బెంగాల్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం మమత చేస్తున్నారు.
కోల్‌కతా కార్పొరేషన్ పరిధిలో సువేందు ప్రభావం పెరగకుండా చూడటం మమతకు సవాల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సువేందు, ముఖ్యమంత్రి మమతను సూటిగా ప్రశ్నిస్తూ సభను వేడెక్కించారు. బెంగాల్ అంటే మమత.. మమత అంటే బెంగాల్ అనే ఇమేజ్ను దెబ్బతీయడమే సువేందు లక్ష్యంగా కనపడుతోంది. అయితే, సువేందు సృష్టిస్తున్న ఈ రాజకీయ ప్రకంపనలు 2026 ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. ప్రస్తుతం బెంగాల్ చూస్తున్న అతిపెద్ద యుద్ధం ఇది.
ఇవి కూడా చదవండి








