ఎన్నికల ప్రచార బరిలో దూసుకుపోతున్న కమలహ్యారిస్…
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి కాస్త లేటుగా దిగినా..ప్రచారాన్ని మాత్రం కమలా హ్యారిస్ ఉరకలెత్తిస్తున్నారు. ఓవైపు డెమొక్రాట్ల నుంచి మద్దతు సాధించడంలో విజయవంతమైన హ్యారిస్.. ఇప్పుడు ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం తొలివిరాళాల సేకరణ కార్యక్రమాన్ని కమలా హ్యారిస్ నిర్వహించారు. ప్రత్యర్థితో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో తాను వెనుకంజలో ఉన్నప్పటికీ.. భారీ మెజార్టీతో గెలుపుసాధిస్తానన్నారు కమలా హ్యారిస్..
ఎన్నికలకు సుమారు నాలుగు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తన విధానాలను వెల్లడిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే తనని తాను వెనకబడ్డ వ్యక్తిగా చెప్పుకొంటూ ఓటర్ల సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.అదే సమయంలో దేశ భవిష్యత్ నిర్మాణం, దేశ తిరోగమనం అనే రెండు లక్ష్యాలను ప్రజల ముందుకు తెచ్చారు కమలా హ్యారిస్. తాము ఎన్నికైతే దేశాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్తామంటూనే… ప్రత్యర్థి ఎంపికైతే మాత్రం తిరోగమనం తప్పదని అభిప్రాయపడ్డారు.
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కమల. ‘‘మనం ఎలాంటి దేశంలో జీవించాలనుకుంటున్నాం? స్వేచ్ఛ, పట్టుదల, చట్టబద్ధమైన పాలన ఉన్న దేశంలోనా? లేదా గందరగోళం, భయం, ద్వేషం ఉన్న దాంట్లోనా?’’ అని ఓటర్లను ప్రశ్నించారు. ట్రంప్ పై ఉన్న కేసులు, ఆరోపణలు వంటి వాటిని పరోక్షంగా ప్రస్తావించారు కమలా హ్యారిస్. మరీ ముఖ్యంగా నల్లజాతీయులు, భారతీయ మూలాలు కలిగిన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు కమల. తనతో చర్చకు ట్రంప్ అంగీకరిస్తారని హారిస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రసంగంలో తనని తాను న్యాయవాదిగా గుర్తుచేసుకున్నారు. ఆ వృత్తిలో తాను అన్ని రకాల నేరస్థులను చూశానని పేర్కొన్నారు. మహిళలపై దుర్భాషలాడిన, వినియోగదారులను మోసగించిన, స్వప్రయోజనాల కోసం నిబంధనల్ని తుంగలో తొక్కిన.. ఇలా చాలా రకాల వ్యక్తులను చూశానన్నారు. వీరిలో ట్రంప్ ఏ రకానికి చెందివారో తనకు తెలుసునంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు.






