బిడెన్ పై అభిశంసన..!
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చిక్కుల్లో పడ్డారు. కుమారుడు హంటర్ బైడెన్ అక్రమ వ్యాపార లావాదేవీలతో పాటు వ్యాపారాల నుంచి అధ్యక్షుడు లబ్ధి పొందారన్న అంశంపై అభిశంసన విచారణ జరగనుంది. మరీ ముఖ్యంగా కీలకమైన నాలుగు అంశాలపై రిపబ్లికన్ కమిటీ దృష్టి సారించనుంది. ఇప్పటికే పలుమార్లు హంటర్ బిడెన్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కథనాలు ప్రచురితమయ్యాయి. వీటన్నింటిపైనా విచారణ సందర్భంగా కమిటీ నిగ్గు తేల్చే పనిలో పడింది.
చైనా, కజకిస్తాన్, యుక్రెయిన్, రష్యా, రొమేనియా వంటి దేశాల నుంచి బైడెన్ కుటుంబానికి, వారి అసోసియేట్స్‌కు చెల్లింపుల రూపంలో 20 మిలియన్ డాలర్లకు పైగా నగదు అందిందని ‘‘ది హౌస్ ఓవర్‌సైట్ కమిటీ’’ ఆగస్టులో విడుదల చేసిన మెమొరాండంలో తెలిపింది. తన కుమారుడికి డబ్బులు పంపించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓలిగార్కులతో కలిసి …వాషింగ్టన్ డీసీలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో జో బైడెన్ విందులో పాల్గొన్నారని ఆగస్ట్ 9న కామర్ ప్రకటించారు. బ్యాంకు రికార్డుల ఆధారంగా మూడు వేర్వేరు మెమోలను ఈ కమిటీ సంపాదించింది. అయితే, వాటిలో జో బైడెన్‌కు నిర్ధిష్ట చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించడంలో కమిటీ విఫలమైంది.
జో బిడెన్ పదేళ్ల కాలంలో దాదాపు 20 సార్లు విదేశీ పౌరులతో సహా వ్యాపార భాగస్వాములతో ఫోన్లో మాట్లాడారని హంటర్ బైడెన్ మాజీ వ్యాపార భాగస్వామి డెవాన్ ఆర్చర్ చెప్పారు. తానెప్పుడూ హంటర్‌తో వ్యాపార లావాదేవీల గురించి చర్చించలేదని జో బిడెన్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఈ ఫోన్ కాల్స్ డేటా ఉన్నట్లు రిపబ్లికన్లు చెబుతున్నారు. అయితే, ఆ ఫోన్ కాల్స్ అన్నీ సాధారణ సంభాషణలే అని, వాటిలో హంటర్ బైడెన్ వ్యాపార లావాదేవీల గురించి కనీసం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని డెవాన్ సాక్ష్యమిచ్చారు. ఆర్చర్ ఇచ్చిన సాక్ష్యం బైడెన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వడంలో విఫలమైందని ‘కాంగ్రెషనల్ ఇంటిగ్రిటీ ప్రాజెక్ట్’ నివేదిక తెలిపింది.
హంటర్ బైడెన్ బోర్డ్ సభ్యుడిగా ఉన్న ఉక్రెయిన్ గ్యాస్ ఎనర్జీ కంపెనీ బురీస్మాపై కొనసాగుతున్న దర్యాప్తును నిలువరించేందుకు జో బైడెన్ ప్రయత్నించారని ఎఫ్‌బీఐకి వచ్చిన అనధికారిక సమాచారంపై కూడా రిపబ్లికన్లు దృష్టి సారించారు. దర్యాప్తుతో సంబంధం ఉన్న ఒక ప్రముఖ ప్రాసిక్యూటర్‌ను తప్పించాలంటూ ఉక్రెయిన్ ప్రభుత్వంపై జో బైడెన్ ఒత్తిడి తెచ్చారని ఎఫ్‌బీఐకి సమాచారముంది. జో బిడెన్, హంటర్ బిడెన్‌లకు 5 మిలియన్ డాలర్లు చెల్లించానని బురీస్మా కంపెనీ మాజీ సీఈవో మైకోలా జ్లోకెవస్కీ చెప్పినట్లు ఆ డాక్యుమెంట్లో ఉంది.ట్రంప్ హయాంలో ఈ ఆరోపణలను ఎనిమిది నెలలపాటు దర్యాప్తు చేసిన న్యాయశాఖ సరైన ఆధారాలు లేవని కొట్టివేసింది. మైకోలా జ్లోకెవస్కీ తర్వాత ఈ వాదనలను తిప్పికొట్టారు. జో బైడెన్‌తో గానీ ఆయన సిబ్బందితో గానీ తానెప్పుడూ సంప్రదింపులు జరుపలేదని.. తనకు, తన కంపెనీకి ఉఫాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో బిడెన్ ఎలాంటి సహాయం చేయలేదని చెప్పారు.
హంటర్ బిడెన్ పన్ను చెల్లింపులపై ఏళ్లుగా జరిగిన విచారణలో న్యాయశాఖ ఉద్దేశపూర్వకంగానే జోక్యం చేసుకుందని రిపబ్లికన్లు ఆరోపించారు. ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ కు చెందిన ఇద్దరు విజిల్ బ్లోయర్లు ఇచ్చిన సాక్ష్యాలను రిపబ్లికన్లు ఉటంకించారు. న్యాయశాఖ దర్యాప్తు ప్రక్రియ వేగాన్ని తగ్గించి, దారులు మూసుకుపోయేలా చేస్తోందని ఈ ఏడాది ప్రారంభంలో ఇచ్చిన వాంగ్మూలంలో ఆ ఇద్దరు విజిల్ బ్లోయర్లు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ విచారణలో బిడెన్ తరపున న్యాయ శాఖ వేగంగా పనిచేసిందని, హంటర్ విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించిందని చెప్పడానికి విజిల్ బ్లోయర్లు ఇచ్చిన వాంగ్మూలమే ఆధారమని రిపబ్లికన్లు చెబుతున్నారు.అయితే, న్యాయశాఖ ఈ వాదనలను తోసిపుచ్చింది.
అభిశంసన విచారణకు ఆదేశిస్తూ, జో బిడెన్ సిబ్బందికి హంటర్ బైడెన్ బృందానికి మధ్య జరిగిన సమాచార మార్పిడి గురించి కూడా స్పీకర్ మెకార్తీ ప్రస్తావించారు. బురిస్మా అవినీతికి సంబంధించి మీడియా ప్రశ్నలకు ఇవ్వాల్సిన జవాబుల విషయంలో…. వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం, హంటర్ బైడెన్లు కుమ్మక్కయ్యారని కమిటీ తెలిపింది. హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. బిడెన్ కుటుంబ వ్యాపార సహచరుడు ఎరిక్ స్కెవరిన్ నుంచి 2015లో ఉపాధ్యక్ష కార్యాలయ సిబ్బంది కేట్ బెడింగ్ఫీల్డ్కు వచ్చిన ఒక మెయిల్ గురించి కమిటీ ఉదహరించింది.ఆ మెయిల్లో బురీస్మా అంశంలో హంటర్ బిడెన్ పాత్రకు సంబంధించి మీడియాతో చెప్పాల్సిన కోట్స్ అనే సందేశం ఉంది అని కమిటీ తెలిపింది.‘‘ఉపాధ్యక్షుడు బిడెన్ దీనికి ఆమోదించారు’’ అని బెడింగ్‌ఫీల్డ్ ఆ మెయిల్‌కు బదులిచ్చారు.
అయితే…..బురిస్మా వ్యవహారంపై వైట్ హౌస్ అధికార ప్రతినిధి అయాన్ సామ్స్ స్పందించారు. రిపబ్లికన్లు.. లేని దాాన్ని రుజువు చేసేందుకు నెలల తరబడి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.






