ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ?
మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపు సంభవించనుందా? మహారాష్ట్ర రాజకీయం కొన్ని రోజుల్లోనే కొత్త రూపు సంతరించుకోబోతోందా? ఎన్సీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇందుకు సంబంధించిన పావులు కదుపుతున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ థాకరే చేసిన ద్రోహాన్ని బీజేపీ ఏమాత్రం మరిచిపోవడం లేదు. ఎలాగైనా ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలన్న తహతహతోనే బీజేపీ రగిలిపోతోంది. సీఎంగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడమే లేదు. చాల రోజుల తర్వాత ఫిబ్రవరి 7న మహారాష్ట్రలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు నారాయణ రాణే ఆస్పత్రి ప్రారంభోత్సవానికి షా వెళ్లారు. ఆ సమయంలోనే బీజేపీ, శివసేన మధ్య పెరిగిన దూరాన్ని ప్రస్తావించారు. రహస్య రాజకీయాలు తానెన్నడూ చేయలేదని, పూర్తి పారదర్శకత, ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా తాము ఇచ్చిన మాట మీద నిలబడతామంటూ బిహార్ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తూ అమిత్‌షా ప్రసంగించారు. బిహార్‌లో జేడీయూ కూటమి కంటే తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని, అయినా సరే… ఇచ్చిన మాట ప్రకారం తాము నితీశ్ కుమార్‌నే సీఎం పదవిలో కూర్చోబెట్టామని షా గుర్తు చేశారు. ‘‘నితీశ్ కుమార్‌నే మేము సీఎం పదవిలో కూర్చోబెట్టాం. ఎందుంకటే ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకోవడానికి అంతే.’’ అని అమిత్‌షా వివరించారు.
ఎన్సీపీతో టచ్‌లోకి వెళ్లిన అమిత్‌షా
అయితే రాజకీయ దూరదృష్టితోనే అమిత్‌షా మహారాష్ట్రలో బిహార్ ఉదంతాన్ని ప్రస్తావించారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమిత్‌షా గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే శరద్ పవార్‌తో కూడా షా మాట్లాడినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఎన్సీపీ ఎవరి పేరును ప్రస్తావిస్తే వారినే ఆ కుర్చీలో కూర్చోబెడతామని కూడా షా పవార్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే సీఎం పదవిలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్‌ను కూర్చోబెడితే మాత్రం తాము అంగీకరించే ప్రసక్తే లేదని, ఫడ్నవీస్‌కు బదులుగా ఎవరిని కూర్చోబెట్టినా తమకు అభ్యంతరం లేదని పవార్ హోంమంత్రి షాతో అన్నట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై ఎన్సీపీ, బీజేపీ మధ్య తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఉద్ధవ్‌ను ఇరకాటంలోకి నెట్టడానికే ఈ ప్లాన్?
గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసే పోటీ చేశాయి. బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. రావడమే ఆలస్యం ఉద్ధవ్ తేనెతుట్టను కదిపారు. సీఎం పదవిని పంచుకునే విషయంలో బీజేపీ తన మాటను నిలబెట్టుకుంటుందని తాము భావిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ఒప్పందం జరగలేదని, కేవలం మౌఖికంగానే ఈ విషయంపై చర్చ జరిగిందని బీజేపీ ప్రకటించింది. దీంతో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీకి స్నేహ హస్తం చాటారు. రాత్రికి రాత్రే సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే… ఆ తర్వాతే రాజకీయాలు మలుపులు తిరిగాయి. అజిత్ పవార్ బీజేపీకి హ్యాండిచ్చి, డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ‘మహా వికాస్ అగాఢీ’ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పర్చాయి. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కువ సీట్లు వచ్చినా… బీజేపీ మహారాష్ట్రలో రాజకీయంగా నష్టపోయింది. అప్పటి నుంచి అమిత్‌షా మహారాష్ట్రపై ఓ కన్నేసి ఉంచారు. సమయం వచ్చినపుడు శివసేనను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైందని అమిత్‌షా భావిస్తున్నారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్సీపీని తమవైపు తిప్పుకుంటే… ప్రభుత్వంలో ముసలం పుట్టడం ఖాయమని, దీంతో శివసేన తీవ్ర ఇరకాటంలో పడిపోతుందన్నది బీజేపీ ప్లాన్. అయితే ఈ ప్లాన్‌కు తుదిరూపం రాలేదు. కేవలం ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలు మాత్రమే జరిపినట్లు వార్తలొచ్చాయి.













