నిన్న రెమ్‌డెసివిర్.. నేడు యాంఫోటెరిసిన్.. అంతా బ్లాక్‌మయం!

బ్లాక్ ఫంగస్ కలకలం దేశాన్ని కుదిపేస్తోంది. దీంతో దీని చికిత్సకు వాడే యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్ కోసం డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ ఇంజక్షన్ దొరక్క బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా భావించే రెమ్‌డెసివిర్ కొరతను ఎదుర్కొన్న బాధితుల కుటుంబ సభ్యులు.. కరోనా గండం నుంచి గట్టెక్కాక.. యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్ల కోసం పెద్ద పోరాటమే చేస్తున్నారు.
ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారి కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 2వేలు, గుజరాత్‌లో 11వందల 63 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. కానీ, దీనికోసం వాడే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ కొరతతో వ్యాధిని నిరోధించడం కష్టమైపోతోంది. ఈ డ్రగ్ ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు. ప్రతి రోజు వందల సంఖ్యలో ఈ ఇంజెక్షన్ కోసం మెడికల్ షాపుల్లో ప్రయత్నిస్తున్నారు.
లక్షలకు లక్షల రూపాయలు పెట్టి కరోనా నుంచి బయటపడినా బ్లాక్ ఫంగస్ దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు ఉన్నదంతా ఊడ్చేసుకోవలసిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా సమయంలో రోగులకు యాంటీ-వైరల్, యాంటీ-బ్యాక్టీరియల్ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో సైటోకైన్లు అభివృద్ధి చెందకుండా ఉండేందుకు స్టెరాయిడ్లు ఇస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్సలో ఎక్కడా యాంటీ-ఫంగల్ ఇంజెక్షన్లను వాడరు. స్టెరాయిడ్ల ప్రభావంతో ఫంగస్ ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరిస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం యాంటీ-ఫంగల్ ఇంజెక్షన్లకు డిమాండ్ పెరగడం.. అందుకు తగ్గట్లుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కరోనాకు ముందు 3వేల 500 నుంచి 7వేల 500 రూపాయలకు లభించే యాంఫోటెరిసిన్-బి.. ఇప్పుడు 25వేల నుంచి 30 వేల రూపాయలు పెట్టినా దొరకడం లేదు. దాంతోపాటు.. యాంటీ-ఫంగల్ చికిత్సలో ఉపయోగపడే మరో కీలక ఇంజెక్షన్ పోసకొనాజోల్‌కూ తీవ్ర కొరత ఏర్పడింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ కమిటీ ప్రత్యామ్నాయ ఇంజెక్షన్లకు ఆమోద ముద్ర వేసినా.. అవి కూడా తగినంతగా లభించడం లేదు. బ్లాక్ ఫంగస్ సోకితే కనీసం 2 నుంచి 6 వారాల చికిత్స అవసరం.
రోగి పరిస్థితిని బట్టి రోజుకు 2 నుంచి 4 డోసుల యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ అవసరం. రోజూ ఈ కోర్సును కొనసాగించాల్సిందే. అంటే.. 2 నుంచి 6 వారాల చికిత్సలో ఈ యాంటీ-ఫంగల్ ఇంజక్షన్‌దే అత్యంత కీలక పాత్ర అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం కనీసం రెండు వారాల చికిత్సకైనా ఒక రోగికి కనీసం 28 యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు అవసరమవుతాయి.
ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ మొదలయ్యే ప్రమాదం ఉంది. రెమ్‌డెసివిర్ విషయంలో ఎంత కట్టుదిట్టంగా ఉన్నా.. ఉత్పాదక కంపెనీల మేనేజర్ స్థాయి అధికారులు సైతం వాటిని నల్లబజారుకు తరలించారు. దాదాపు 60 ఏళ్ల క్రితం యాంఫోటెరిసిన్-బి ఔషధానికి లైసెన్స్ వచ్చింది. మొదట్లో స్థానికంగా వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్లకు వినియోగించే వారు. తర్వాత ప్రాణాంతకమైన ఫంగస్‌కు వాడడం ప్రారంభించారు. ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఫంగల్ వ్యాధులకు కీలకమైన ఔషధంగా యాంఫోటెరిసిన్-బి కొనసాగుతోందని ఔషధ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్‌ఫంగస్ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నట్లు వస్తోన్న నివేదికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యగా వీటి చికిత్సలో వియోగించే యాంటీఫంగల్ ఔషధ ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక, తెలంగాణలో ప్రభుత్వ కమిటీ అనుమతి లేకుండా ఈ డ్రగ్‌ను విక్రయించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.