విపక్షాల భేటీకి కేసీఆర్కు ఎందుకు ఆహ్వానం అందలేదు..?
కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శ. అందుకే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో వేదికను ఏర్పాటు చేయాలనుకున్నారాయన. అందుకే ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని సైతం ఫణంగా పెట్టి భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ను విస్తరించాలనేది ఆయన ప్లాన్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేసిందని.. అలాగే దేశమంతా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలను సైతం కలిశారు.
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ దూకుడు చూసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఏదో చేయబోతున్నారని అందరూ భావించారు. ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు ఉండడం, తెలంగాణను సాధించిన వ్యక్తిగా పేరొందడంతో ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి. కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి కడతారని అందరూ అనుకున్నారు. అందుకోసం జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిశారు. ఉమ్మడిగా కార్యాచరణ రూపొందిద్దామని ప్రతిపాదించారు. ఇందుకు అవరమైతే ఆర్థికంగా తాను వనరులు సమకూరుస్తానని హామీ కూడా ఇచ్చారు. దీంతో వాళ్లు కూడా సరేనన్నారు.
కానీ ఏమైందో ఏమో.. ఏడాది తిరిగే సరికి కేసీఆర్ కలిసిన పార్టీలన్నీ ఈయన్ను పట్టించుకోవడం మానేశాయి. మమత బెనర్జీ, నితీశ్ కుమార్, స్టాలిన్, కుమార స్వామి, శరద్ పవార్, కేజ్రివాల్, నవీన్ పట్నాయక్, సోరెన్.. లాంటి నేతలందరినీ కేసీఆర్ కలిశారు. ఇప్పుడు వీళ్లలో చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. నవీన్ పట్నాయక్ తటస్థంగా ఉంటే కుమారస్వామి బీజేపీకి దగ్గరవుతున్నారు. కేసీఆర్ మాత్రం అటుఇటు కాకుండా ఉండిపోయారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ లేకుండా అసాధ్యమనే నమ్మకానికి ఈ పార్టీల రావడమే కేసీఆర్ దూరమవడానికి కారణంగా కనిపిస్తోంది. కేసీఆర్ మాత్రం కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరం పాటించాలనుకుంటున్నారు.
రేపు పట్నాలో బీజేపీయేతర పక్షాల సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల నేతలందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క పార్టీకి కూడా దీనికి ఆహ్వానం అందలేదు. వైసీపీ, టీడీపీ మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉండడంతో వాటికి ఆహ్వానం రాదని ఊహించిందే. అయితే కేసీఆర్ వీళ్లందరితో కలిసి తిరిగిన నేత. అలాంటప్పుడు కచ్చింతంగా ఆయనకు ఆహ్వానం అందుతుందని భావించారు. కాని అలా జరగలేదు. కాంగ్రెస్ ను విభేదించే కేజ్రివాల్ కు కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా హాజరవుతున్నారు. అయినా కేసీఆర్ హాజరు కాకపోవడం.. ఆయనకు ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ బీజేపీకి అనుకూలురనే ముద్ర పడడం వల్లే ఆయనకు ఆహ్వానం అందలేని ఆయా పార్టీల నేతలు చెప్తున్నారు. మరి లోక్ సభ ఎన్నికల నాటికి కేసీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది వేచి చూడాలి.













