కర్షక పక్షపాతికి భారత రత్న..
రైతే రాజు.. దేశానికి వెన్నెముక.. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు లాంటి పదాల్ని నిజం చేసిన ధీశాలి దేశ ఐదో ప్రధాని చౌదరి చరణ్ సింగ్. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. వారు ఎదుర్కొంటున్న కష్టాలను అనుభవించారు. అధికారం చేపట్టిన తర్వాత కర్షక ప్రతినిధిగా వ్యవహరించారు. రైతు చాంపియన్ గా పేరు గాంచారు. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా చౌదరి చరణ్ సింగ్.. రైతుల గుండెల్లో చిరంజీవిగా నిలుస్తారు. అలాంటి చౌదరి చరణ్ సింగ్ కు.. ఆలస్యంగా అయినా కేంద్రం భారత రత్న అవార్డు ప్రకటించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సామాన్య కుటుంబంలో 1903 డిసెంబర్ 23న చౌధరి చరణ్ సింగ్ జన్మించారు. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టారు. తొలుత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) తరఫున చురుగ్గా వ్యవహరించిన ఆయన.. అక్కడి విధానాలు నచ్చక సొంత పార్టీ పెట్టుకున్నారు. 1967లో భారతీయ క్రాంతి దళ్‌ను స్థాపించారు. తర్వాత కాలంలో యూపీ సీఎంగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 1967 ఏప్రిల్ 3 నుంచి 1968 ఫిబ్రవరి 25 వరకు తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. ఆ ప్రభుత్వం ఏడాది తిరగకముందే కుప్పకూలింది. దీంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇందిర కాంగ్రెస్ మద్దతుతో 1970 ఫిబ్రవరి 18 నుంచి అదే ఏడాది అక్టోబర్ 1 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇందిర కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో ఆయన ప్రభుత్వం మరోసారి కుప్పకూలింది.
జాతీయ రాజకీయాల్లోకి..
అప్పటివరకు యూపీ రాజకీయాలకే పరిమితమైన చరణ్‌సింగ్.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. మొరార్జీదేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఆయన హయాంలోనే 1979 జనవరి నుంచి జులై వరకు డిప్యూటీ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జనతా ప్రభుత్వంలో లుకలుకల వల్ల మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దీంతో ఇందిర కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటైంది. 1979 జులై 28 నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ ఐదో ప్రధానిగా చరణ్‌సింగ్ సేవలందించారు. సంజయ్‌గాంధీ విషయంలో పెట్టిన కొన్ని షరతులను అంగీకరించకపోవడంతో ఇందిర కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో నాటి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి మళ్లీ ఎన్నికలు జరిగేంత (1980 జనవరి) వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. 1980లో లోక్‌దళ్ పేరిట మరోసారి సొంతంగా పార్టీని స్థాపించారు.
రైతుల కోసం సంస్కరణలు..
రైతు కుటుంబంలో జన్మించిన చరణ్‌సింగ్‌కు వారి కష్టాల గురించి బాగా తెలుసు. అందుకే రైతుల కోసం, గ్రామీణ భారతం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వ్యవసాయం రూపురేఖలు మార్చిన ఘనత చరణ్‌సింగ్‌కే దక్కుతుంది. స్వాతంత్రానికి పూర్వం బ్రిటీష్ ప్రభుత్వ హయాంలోనే తనవంతు కృషి చేశారు. 1937లో తొలిసారి ఛప్రౌలి నుంచి యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధిగా గ్రామీణ ఆర్థికవ్యవస్థలో ఉన్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించేవారు. భూస్వాముల దోపిడీని ఎండగట్టేవారు. 1939లోనే రైతుల కోసం రుణ విముక్తి బిల్లును తీసుకొచ్చారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎంతోమంది రైతన్నలకు ఇది ఉపశమనం కల్పించింది. అన్నదాతల ఆత్మహత్యలను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది.
స్వాతంత్రానంతరం యూపీలో కాంగ్రెస్ ముఖ్య నేతగా ఎదిగిన ఆయన.. 1952, 1957, 1962లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. యూపీ తొలి సీఎం గోవింద్ వల్లభ్‌పంత్ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలోనే జమిందారీ వ్యవస్థ నిర్మూలన చట్టం, ల్యాండ్ హోల్డింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. భూస్వాముల చేతుల్లో నలుగుతున్న భూమిపై పేదలకు హక్కులు కల్పించారు. దీంతో ఉత్తర భారతంలో జాట్లు, యాదవులు, గుజ్జర్లు, కుర్మీలు.. ఇలా అన్ని సామాజికవర్గ రైతులకు నాయకుడిగా ఎదిగారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు జీతాలు, ఇతర ప్రయోజనాల్లో భారీగా కోత పెట్టారు. 1980 జనవరి 14న ఆయన తుది శ్వాస విడిచారు. రైతుల కోసం చేసిన సేవలకు గానూ రాజ్ ఘాట్‌లో ఆయన స్మారకానికి ‘కిసాన్ ఘాట్’ అని పేరు పెట్టారు. ఆయన జన్మదినాన్ని ‘కిసాన్ దివస్’గా జరుపుకుంటారు.













