కాంగ్రెస్ కూటమి నుంచి పవార్ ఔట్..?
లోక్ సభ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే సమయం ఉంది. బీజేపీ పదేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతామని కమలం పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అంతర్గత సమస్యలతో సతమతమవుతూ ఉంది. కాంగ్రెస్ కూటమిలోని పార్టీలూ కూడా ఆ పార్టీతో ఉంటాయో ఉండవో చెప్పలేని పరిస్థితి ఉంది. తాజాగా యూపీఏలో భాగస్వామిగా ఉన్న శరద్ పవార్ ఆ కూటమికి దూరమవుతున్నారేమో అనిపిస్తోంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – ఎన్సీపీ అధినేత శరద్ పవారా చాలా కాలంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. కష్టమైనా, సుఖమైనా ఆ పార్టీతోనే నడుస్తున్నారు. సోదరుడు బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా శరద్ పవార్ మాత్రం కాంగ్రెస్ వెంటే ఉన్నారు. శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని నడిపించాయి. కేంద్రంతో ఫైట్ చేయడంలోనూ శరద్ పవార్ ముందుండే వారు. నిన్న మొన్నటి వరకూ అదానీ అంశంపై పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు ఎన్సీపీ ఎంపీలు. కాంగ్రెస్ తో కలిపి ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు.
ఇంతలోనే ఏమైందో ఏమో.. అదానీ – మోదీ అంశం జాతీయ సమస్య కాదన్నారు. అదానీ దేశానికి చేసిన మేలును కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. అంతేకాదు.. మోదీ విద్యార్హతకు సంబంధించిన అంశంపైన కూడా అది ప్రజా సమస్య కాదన్నారు. దీంతో కాంగ్రెస్ కూటమిలోని పార్టీలన్నీ ఖంగుతిన్నాయి. పవార్ ఎందుకిలా మాట్లాడారో అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. బహుశా బీజేపీతో కలిసి ప్రయాణం చేసేందుకు శరద్ పవార్ సిద్ధమవుతున్నారేమో.. అని యూపీఏ నేతలు భావిస్తున్నారు. ఇటీవల నాగపూర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో శరద్ పవార్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత శరద్ పవార్ వైఖరిలో మార్పు కనిపించింది.
శరద్ పవార్ ఇక తమతో ఉండరని కాంగ్రెస్ కూడా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత శరద్ యాదవ్ ను తెరపైకి తెస్తోంది. బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఏకతాటి పైకి తెచ్చే బాధ్యతను శరద్ యాదవ్ కు అప్పగించాలనుకుంటోంది. ఆయనకు విపక్ష పార్టీల నేతలందరితో సత్సంబంధాలున్నాయని భావిస్తోంది. శరద్ పవార్ లేని లోటును శరద్ యాదవ్ తో భర్తీ చేయాలనుకుంటోంది. మరి శరద్ పవార్ వైఖరేంటో తెలియాల్సి ఉంది.













