ముల్లును ముల్లుతోనే తీయాలనుకుంటున్న ప్రియాంక గాంధీ..!
దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమా కాంగ్రెస్ లో కనిపిస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలు తప్పకుండా తమకు పట్టం కడతారని నమ్మకంతో ఉంది. అయితే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై మాత్రమే ఆధారపడకుండా తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది ప్రియాంక గాంధీ. ప్రజాకర్షక హామీలు గుప్పిస్తూ ముందుకెళ్తోంది. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు తమ హామీలు తప్పకుండా తమను అధికార పీఠానికి దరి చేరుస్తాయనే ధీమాతో ఉంది కాంగ్రెస్ పార్టీ.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతను ప్రియాంక గాంధీ భుజానికెత్తుకున్నారు. ఆమె అక్కడ ప్రచారం మొదలు పెట్టారు. కర్నాటకలో తమను విజయతీరాలకు చేర్చిన హామీలనే ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రియాంక వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేయాలనుకుంటున్న 5 హామీలను వివరించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 నగదు, రూ.500లకే వంట గ్యాస్, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల లోపు సగం ధరకే కరెంట్, రైతు రుణాల మాఫీ, ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని ప్రియాంక గాంధీ వెల్లడించారు. ప్రియాంక సభకు మంచి స్పందన లభించింది.
అయితే అన్నిటికీ మించి ప్రియాంక సభలో జై బజరంగబలి నినాదాలు మిన్నంటాయి. సాధారణంగా బీజేపీ హిందుత్వ నినాదంతో ఎన్నికలకు వెళ్తుంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా హిందుత్వ అజెండా తీసుకుంది. ప్రియాంకగాంధీ ర్యాలీ, సభ సందర్భంగా బ్యానర్లు, కటౌట్లలో జై బజరంగ బలి స్లోగన్లు కనిపించాయి. కూడళ్లలో గదతో కూడిన డిజైన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. బీజేపీ ఒక్కటే హిందుత్వ పార్టీ కాదని, తాము కూడా హిందువలమేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో హిందూ ఓటు బ్యాంకుపై ఎక్కువగా ఆధారపడుతుంది బీజేపీ. దాన్ని సొమ్ము చేసుకోవడం ద్వారా లబ్ది పొందాలనుకుంటోంది కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ కూడా జై బజరంగబలి అంటూ హిందూ నినాదాలతో హోరెత్తిస్తోంది.
ఒకవైపు ప్రియాంక గాంధీ, మరోవైపు డీకే శివకుమార్ మధ్య ప్రదేశ్ ఎన్నికలను సమన్వయం చేస్తున్నారు. వీళ్ల అండతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తక్కువే. చిన్నాచితకా ఉన్నా వాటిని పరిష్కరించకోగలమనే ధీమ్ కాంగ్రెస్ అధిష్టానంలో కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో అధికారంలోకి రాగలిగితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం ఈజీ అవుతుందని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది. మరి చూడాలి కాంగ్రెస్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో..!













