బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం..!?
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ సంచలనం దిశగా అడుగులు వేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉబలాటపడుతున్నారు. బీజేపీతో కొంతకాలం క్రితం వరకూ సన్నిహితంగా ఉన్న నితీశ్.. ఆ తర్వాత కమలంతో కటీఫ్ చెప్పేసి ఆర్జేడీతో కలిసారు. అప్పటి నుంచి ఆయన కేసీఆర్ లాగే కేంద్రంలో బీజేపీని గద్దె దించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే బీహార్ లో ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పడం సాధ్యం కాదనుకుంటున్న నితీశ్.. హస్తినలోనే మకాం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం జేడీయూ, ఆర్జేడీ విలీన ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. ఢిల్లీలో చక్రం తిప్పాలంటే సొంతరాష్ట్రంలో ముందు సత్తా చాటాలనుకుంటున్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడాయన 2005 నుంచి ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. జేడీయూ అధినేతగా ఉన్న ఆయన.. ఒకసారి బీజేపీతో, మరోసారి కాంగ్రెస్ తో.. ఇలా పొత్తులు పెట్టుకుంటూ సీఎం పీఠాన్ని మాత్రం తాను అనుభవిస్తూ వస్తున్నారు. సీఎం కుర్చీకోసం నితీశ్ కుమార్ ఎవరితో అయినా కలుస్తారనే పేరు తెచ్చుకున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. నితీశ్ తో కలిసేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ సిద్ధంగానే ఉంటూ వచ్చాయి. తాజాగా జేడీయూకు బద్ధశతృవుగా పేరొందిన ఆర్జేడీ కూడా నితీశ్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే నితీశ్ చాకచక్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జేడీయూ, ఆర్జేడీల ఉమ్మడి శత్రువు బీజేపీ మాత్రమే. ఇందుకోసం ఎవరితో అయినా కలిసి ముందుకెళ్లేందుకు రెండు పార్టీలూ సిద్ధంగా ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలనే పట్టుదలతో రెండు పార్టీలూ ఉన్నాయి.
బీహార్లో 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందు 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించాలని జేడీయూ అధినేత నితీశ్ కుమార్ భావిస్తున్నారు. ఎక్కువ ఎంపీ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో సత్తా చాటేందుకు వీలవుతుందనుకుంటున్నారు. జేడీయూ – ఆర్జేడీ ప్రస్తుతం ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఇలా వేర్వేరుగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్తే పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటున్నారు. అందుకే రెండు పార్టీలు విలీనం అయితే బాగుంటుందని భావిస్తున్నారు. అప్పుడు ఒకే పార్టీగా ఎన్నికలకు వెళ్లొచ్చు. అత్యధిక సీట్లు సాధించవచ్చు. అప్పుడు ప్రధాని పీఠం కూర్చునే అర్హత తనకు దక్కుతుందని నితీశ్ కుమార్ అంచనా వేస్తున్నారు. జేడీయూ – ఆర్జేడీ విలీనంపై రెండు పార్టీల నుంచి అధికారికంగా ఎలాంటి సంకేతాలు రాకపోయినా.. ఆ రెండు పార్టీల్లో అంతర్గతంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.
2024 ఎన్నికల్లో సత్తా చాటీ నితీశ్ ఢిల్లీ పీఠంపై కూర్చుంటే అప్పుడు ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బీహార్ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఇందుకు నితీశ్ కుమార్ కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో 2025 అసెంబ్లీ ఎన్నికలకు తేజస్వి యాదవ్ నేతృత్వం వహిస్తారని నితీశ్ కుమార్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి రెండు పార్టీల విలీన ప్రతిపాదన నిజమేనని అందరూ అనుకుంటున్నారు. కేంద్రంలో నితీశ్, రాష్ట్రంలో తేజస్వి యాదవ్ చక్రం తిప్పేలా.. రెండు పార్టీలకు, ఇద్దరు నేతలకు లబ్ది చేకూరేలా విలీన ప్రతిపాదన ఉంటుందని భావిస్తున్నారు. మరి ఈ విలీనం ఇద్దరికీ ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి.













