కర్నాటక ప్రజల మెచ్యూరిటీ తీర్పు..!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు తప్పదని అందరూ భావించారు. ఇప్పుడు ఫలితాలు కూడా మొదట్లో అలాగే కనిపించాయి. అయితే చివరకు కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజారిటీ సాధించింది. కర్నాటకలో సంప్రదాయాన్ని కొనసాగించారు ప్రజలు. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి అధికారాన్ని దక్కించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా ప్రజలు పరిణితితో తీర్పు చెప్పారని చెప్పొచ్చు.
కర్నాటకలో మూడు ప్రధాన పార్టీల మధ్యే ఎప్పుడూ పోరు నడుస్తుంటుంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఇక్కడ అధికారం కోసం పోటీ పడుతుంటాయి. ప్రతిసారీ ఓటర్లు ఓ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టకపోవడంతో చాలాసార్లు హంగ్ ఏర్పడింది. దీంతో రెండు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చేది. కాంగ్రెస్ – జేడీఎస్, బీజేపీ – జేడీఎస్ కలిసి ఇక్కడ పలుమార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ ప్రభుత్వాలు ఎంతోకాలం నిలబడలేదు. కూటమిలో విభేదాలు రావడం, లేకుంటే అధికారపక్షంలోని పార్టీల ఎమ్మెల్యేలు గోడదూకి ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్లడంతో ప్రభుత్వాలు కుప్పకూలిపోయేవి. దీంతో సంకీర్ణ ప్రభుత్వాలపై కర్నాటక ప్రజలకు విసుగు వచ్చేసింది.
ఈసారి కూడా అలాంటి తీర్పే వస్తుందని చాలా మంది భావించారు. బీజేపీ, కాంగ్రెస్ లకు స్పష్టమైన మెజారిటీ రాకపోతే కచ్చితంగా జేడీఎస్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. జేడీఎస్ చెప్పినట్టు చేయకపోతే కుమారస్వామి చుక్కలు చూపిస్తుంటారు. ఇలాగే రెండుసార్లు కింగ్ మేకర్ నుంచి కింగ్ గా ఎదిగారు కుమారస్వామి. ఈసారి కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నట్టు అర్థమైంది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. మరో పార్టీపైన ఆధారపడే అవకాశం లేకుండా చేశారు. లేకుంటే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయేది. అప్పుడు మళ్లీ సంకీర్ణం వచ్చేది. సంకీర్ణ ప్రభుత్వాలను బీజేపీ ఏం చేస్తోందో.. ఎలా ఆడిస్తోందో.. అందరికీ తెలుసు. బహుశా ఇవన్నీ ప్రజల గమనించినట్లున్నారు. అందుకే ఇతర పార్టీలపై ఆధారపడకుండా ఐదేళ్లపాటు రాజ్యమేలేలా కాంగ్రెస్ కు అవకాశం కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని నిలబెట్టుకుని పాలన సాగించడమే దాని బాధ్యత. మరి ప్రజల తీర్పును ఏ మేరకు నిలబెట్టుకుంటారనేది కాలమే నిర్ణయిస్తుంది.













