జయలలిత మృతి వెనుక కుట్ర..! శశికళ, చీఫ్ సెక్రటరీ, అపోలో ఆసుపత్రులపై సంచలన నివేదిక!
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. జయలలిత లేని రాజకీయాన్ని అక్కడ ఊహించుకోలేం. ఆవిడ మరణించిన తర్వాత కూడా ఆమె తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారనే చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఆమె మరోసారి రాజకీయాలను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారనే చెప్పొచ్చు. జయలలిత మృతిపై నియమితమైన జస్టిస్ ఆర్ముగస్వామి.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అదిప్పుడు అసెంబ్లీ ముందుకు వచ్చింది. నివేదికలో పలు సంచలన అంశాలను ఆయన వెల్లడించారు. ఇదిప్పుడు తమిళనాడులో తీవ్ర సంచలనం కలిగిస్తోంది.
జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉందని జస్టిస్ ఆర్ముగస్వామి నివేదిక వెల్లడించింది. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అప్పటి అధికారులు తప్పుడు ప్రకటనలు చేశారని వెల్లడించింది. జయలలిత సన్నిహితురాలు శశికళ, అప్పటి చీఫ్ సెక్రటరీ డాక్టర్ రామ్మోహన్ రావు, కె.ఎస్.శివకుమార్.. తదితరులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఆర్ముగ స్వామి సిఫారసు చేశారు. అంతేకాదు.. అప్పటి ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, అపోలో ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తదితరులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జయలలిత అనారోగ్యానికి కారణమైనప్పుడు ఆసుపత్రిలో పరిస్థితులపై సరైన సమాచారం ఇవ్వలేదని జస్టిస్ ఆర్ముగ స్వామి నివేదించారు. అప్పుడు జయలలిత అనుభవించిన క్షోభపై ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ఊపిరితిత్తుల నుంచి రోజుకు సుమారు లీటర్ చొప్పున నీరు కారిందని.. అయినా ఆమెకు అద్భుతమైన వైద్యం చేశామని అపోలో ఆసుపత్రి పేర్కొందని వెల్లడించారు. అయితే అందుకు తగ్గ పత్రాలను సమర్పించలేదని తెలిపారు. జయలలితను శశికళ దగ్గరుండి చూసుకున్నారని.. అయితే వాస్తవాలను ఆమె తొక్కిపెట్టారని జస్టిస్ ఆర్ముగ స్వామి నివేదించారు. 2012లో జయలలితకు శశికళ రెండోసారి దగ్గరైన తర్వాత వారి మధ్య సత్సంబంధాలు లేవని తేల్చారు.
మరోవైపు అపోలో ఆసుపత్రి యాజమాన్యంపైన కూడా జస్టిస్ ఆర్ముగ స్వామి సంచలన అంశాలు వెల్లడించారు. తన ఆసుపత్రిలో సీఎంకు చికిత్స చేస్తున్నప్పుడు ఏం జరుగుతోందో ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వాస్తవాలు తప్పకుండా ఆయన దాచారని ఆర్ముగ స్వామి నివేదిక వెల్లడించింది. డాక్టర్ వైవీసీ రెడ్డి, డాక్టర్ బాబూ అబ్రహాం మొదటి నుంచి జయలలితకు చికిత్స అందించారని.. విదేశాల నుంచి కూడా డాక్టర్లను పిలిపించి చూపించారని తెలిపారు ఆర్ముగ స్వామి. అయితే విదేశీ డాక్టర్లు ఆమెకు యాంజియో, సర్జరీ చేయాలని సూచించినా అపోలో వైద్యులు పట్టించుకోలేదన్నారు. కొందరి ఒత్తిడి మేరకే అలా చేశారనిపిస్తోందని నివేదించారు ఆర్ముగ స్వామి. డాక్టర్ సమిన్ శర్మ యాంజియో చేసేందుకు జయలలితను ఒప్పించినా.. అది జరగలేదన్నారు. నాటి చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించడంలో అపోలో యాజమాన్యం విఫలమైందన్నారు. నాడు ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నప్పుడు 21 విధానపరమైన అంశాలపై నాటి చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు సంతకాలు తీసుకున్నారని నివేదిక తెలిపింది. అయితే వీటి గురించి ప్రభుత్వానికి తెలియజేయలేదన్నారు.
జయలలితపై ఆర్ముగ స్వామి నివేదిక ఇప్పుడు తీవ్ర సంచలనం కలిగిస్తోంది. శశికళ, రామ్మోహన రావు సహా పలువురిని విచారించాల్సిన అవసరం ఉందని తేల్చారు. అంతేకాక అపోలో యాజమాన్యం పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి జయలలిత మృతిపై అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆర్ముగ స్వామి నివేదిక ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.













