హిందీపై మరోసారి దుమారం ఎందుకు..? అమిత్ షా సిఫారసులు ఏం చెప్తున్నాయి?
దేశంలో మరోసారి హిందీ భాషపై వివాదం తలెత్తింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ హిందీ భాషపై చేసిన సిఫారసులు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. అమిత్ షా సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా స్టాలిన్, కేటీఆర్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. హిందీ కూడా గుర్తింపు పొందిన భాషే తప్పా.. జాతీయ భాష కాదని.. దాన్ని అందరిపై బలవంతంగా రుద్దుతామంటే సహించబోమని హెచ్చరించారు. కేంద్రం హిందీని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్న వేళ.. దాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. అసలీ వివాదం ఎక్కడ మొదలైంది.?
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లోనే హిందీ ఎక్కువగా మాట్లాడతారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేవాళ్లు చాలా తక్కువ. అందుకే హిందీకి వ్యతిరేకంగా 1965లో ఉద్యమించారు పెరియార్, కరుణానిధి లాంటివారు. దీంతో దిగొచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం దాన్ని విరమించుకుంది. అప్పటి నుంచి తమిళనాడులో హిందీ అనేది లేదు. ఇప్పటికీ తమిళనాడులో హిందీ పాత్ర నామమాత్రం. కానీ ఇప్పుడు మరోసారి హిందీ భాష తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటిలో హిందీని కంపల్సరీ చేయాలనేది అమిత్ షా కమిటీ సిఫారసు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటిలో హిందీని తప్పనిసరి చేయాలనేది అమిత్ షా కమిటీ సిఫారసు. అంటే సెంట్రల్ యూనివర్సిటీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐఐటీలు, ఐఐఎం లాంటి సంస్థలు.. రైల్వేలు, పోస్టల్, సివిల్స్ లాంటి పరీక్షల్లో హిందీ తప్పనిసరి కానుంది. ఇది హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులకు తీరని నష్టం. హిందీ రాష్ట్రాల విద్యార్థులతో పోల్చినప్పుడు దక్షిణాది వాళ్లు వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల విద్య, ఉద్యోగావకాశాల్లో దక్షిణాది రాష్ట్రాలు విద్యార్థులు, అభ్యర్థులు పోటీ పడలేరు. దక్షిణాదిలో మాతృభాష తర్వాత ఇంగ్లీష్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హిందీది మూడో స్థానమే. అలాంటి భాషను తీసుకొచ్చి కచ్చితంగా నేర్చుకోవాలనే నిబంధన పెట్టడం సరికాదనేది దక్షిణాది రాష్ట్రాల డిమాండ్.
దేశాన్ని హిందీమయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిందీని కంపల్సరీ చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హిందీ కంపల్సరీ చేయడాన్ని తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాస్తవానికి హిందీ జాతీయ భాష కాదు. ఇది కూడా గుర్తింపు పొందిన 18 భాషల్లో ఒకటి. ఏ భాషనైనా ఎంచుకునే అధికారం దేశ ప్రజలకు ఉంది. అలా కాకుండా కంపల్సరీ పేరుతో బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అనేది స్టాలిన్, కేటీఆర్ వాదన. ఇదే జరిగితే మరో భాషా ఉద్యమానికి నడుం బిగిస్తామని హెచ్చరించారు స్టాలిన్. కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా అమిత్ షా సిఫారసులను తీవ్రంగా వ్యతిరేకించారు. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో వేచిచూడాలి.













