గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదం చెప్తున్న పాఠమేంటి..?
ఒక్క ప్రమాదం ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. వంతనపై ప్రాణాలు వేలాడాయి. నీటిలో కలిసిపోయాయి. గుజరాత్ లోని మోర్బీలో జరిగిన వేలాడే వంతెన ప్రమాతంలో 140 వరకూ ప్రాణాలు కోల్పోయారు. వినోదానికి కోసం వెళ్లిన వారు జలసమాధి అయిపోయారు. వంతెన పునఃప్రారంభించిన వారం రోజులలోపే జరిగిన ఈ ప్రమాదానికి బాధ్యులెవరు..? ప్రభుత్వమా.. వంతెన నిర్మించిన వాళ్లా.. వంతెన రిపేర్ చేసిన వాళ్లా..? వాళ్ల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు..?
గుజరాత్ లోని మోర్బీలో జరిగిన వంతెన ప్రమాదం అందరినీ విషాదంలో ముంచెత్తింది. వంతెనపై కట్టిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో సందర్శకులంతా ఒక్కసారిగా నదిలో పడిపోయారు. కొంతమంది బ్రిడ్జి తీగల మధ్యలో చిక్కుకుని హాహాకారాలు చేశారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు వాళ్లు చేసిన ప్రయత్నాలు చూసి గుండెలు తరుక్కుపోయాయి. 140 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇందులో ఓ ఎంపీ బంధువులే 12 మంది ఉన్నారు. వారి కుటంబసభ్యుల బాధ వర్ణనాతీతం.. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ఈ ఘటనకు బాధ్యులంటూ 9 మందిని అరెస్ట్ చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇంతటితో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందా?
గుజరాత్ లోని మోర్బీలో మచ్చు నదిపైన సుమారు 150 ఏళ్ల కిందట బ్రిటీష్ వాళ్లు ఈ తీగల వంతెన నిర్మించారు. అప్పటి నుంచి ఇది వాడుకలోనే ఉంది. అయితే పాతబడిపోవడంతో రిపేర్లు చేయాలని 6 నెలల క్రితం దీన్ని మూసేశారు. రెండు నెలల క్రితం నుంచి రిపేర్లు ప్రారంభించారు. రిపేర్లు పూర్తయ్యాయంటూ దీపావళి మరుసటి రోజు నుంచి సందర్శకులకు అనుమతి ఇచ్చారు. ప్రారంభించిన 5 రోజుల్లోనే బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో ఈ వంతెన నిర్వహణ చూస్తున్న ఒరేవా కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ కంపెనీకి నిర్వహించే అర్హతలేదనే ఆరోపణలు వస్తున్నాయి. బ్రిడ్జి నిర్వహణకు ఈ కంపెనీకి 15 ఏళ్లపాటు లీజు దక్కింది. ఒరేవా కంపెనీ అంటే మరేదో కాదు.. మనకందరికీ సుపరిచితమైన అజంతా గడియారాల మాతృ సంస్థ. దీనికి బ్రిడ్జిలను రిపేర్ చేసి నిర్వహించే అనుభవమే లేదు. లీజు దక్కించుకున్న ఒరేవా కంపెనీ.. రిపేర్ బాధ్యతలను మరొకరికి అప్పగించింది. వాళ్లు రిపేర్ పూర్తయిందంటూ చేతులు దులుపుకున్నారు.
వాస్తవానికి బ్రిడ్జి సామర్థ్యానికి తగ్గట్టు సందర్శకులను అనుమతించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. లెక్కకు మించి బ్రిడ్జిపైకి సందర్శకులను అనుమతించారు. దీంతో వంతెన తట్టుకోలేకపోయింది. అంతేకాదు.. రిపేర్ చేసిన తర్వాత బ్రిడ్జ్ కెపాసిటీ పరీక్షలు నిర్వహించలేదని తేలింది. వాస్తవానికి ఈ బ్రిడ్జి సామర్థ్యం 125మందే. కానీ ప్రమాదం సమయంలో బ్రిడ్జి పైన సుమారు 4వందల మంది ఉన్నారని తేలింది. అంతమందిని ఎందుకు అనుమతించారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అదే సమయంలో కొంతమంది సందర్శకులు వంతెనపై ఎగురుతూ, గెంతుతూ కనిపించారు. దీంతో వంతెన కుప్పకూలింది.
వంతెన కూలి ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే .. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రిపేర్లు చేసిన సంస్థపై జీవితకాల నిషేధం విధించాలి. కొంతమంది బాధ్యతారాహిత్యానికి, అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి వందల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఆర్థిక సాయంతో వారికి న్యాయం చేయలేం.













