ఖర్గే ముందున్న సవాళ్లేంటి..? పార్టీని గట్టెక్కించగలిగే సత్తా ఆయనకు ఉందా..?
కాంగ్రెస్ పార్టీ కొత్త రూపు సంతరించుకుంటోంది. కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీలో కొత్త ముఖాలు తెరపైకి రాబోతున్నాయి. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు రావడంతో ఆ పార్టీ ఆఫీస్ బేరర్స్ అందరూ రాజీనామాలు చేశారు. దీంతో ఖర్గే తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. గాంధీ ఫ్యామిలీయేతర వ్యక్తి దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. మరి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ సవాళ్లను ఎదుర్కోగలరా..? బీజేపీని ఎదురొడ్డే సత్తా ఖర్గేకు ఉందా.? అసలు ఆయన ముందున్న సవాళ్లేంటి..?
అనేక అనూహ్య పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. అయితే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాతే ఖర్గేకు కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. వాటిని ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. అయితే ఖర్గేకు గాంధీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో వాటిని ఖర్గే సాల్వే చేసుకోగలరనే నమ్మకం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడైనా పగ్గాలు మాత్రం గాంధీ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ పట్టు కోల్పోయింది. అంతేకాక అంతర్గత విభేదాలు ఆ పార్టీని బజారున నిలబెట్టాయి. దీంతో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్గే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. పార్టీని చక్కదిద్దాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే పార్టీ గాడిన పడడం కష్టం. పార్టీ చక్కదిద్దే క్రమంలో ముందు అంతర్గత విభేదాలను చక్కదిద్దాలి. పార్టీ ఐక్యంగా ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే జీ23 పేరిట కాంగ్రెస్ లోనే కొంతమంది నేతలు బహిరంగంగానే వేరుకుంపటి పెట్టుకున్నారు. అలాంటి వాటిపైన ఖర్గే ఫస్ట్ దృష్టి పెట్టాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఇప్పటికి 8 ఏళ్లు. 2024 ఎన్నికలు ఆ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం. గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. 2024లో కూడా అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదల ఆ పార్టీలో కనిపిస్తోంది. పార్టీని బతికించుకునేందుకు, అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ ఏకం కావాలనే నినాదంతో భారత్ జోడో యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీ అప్పగించిన ఏ పనైనా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ ప్రకటించారు. గాంధీ ఫ్యామిలీ వ్యక్తి కావడంతో రాహుల్ గాంధీకి తిరుగుండదు. తాను ఎక్కడికెళ్లినా పార్టీ ఘన స్వాగతం పలుకుతుంది. తన మాటకు విలువ ఇస్తుంది. అదే సమయంలో ఖర్గే కూడా మిగిలిన వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల లోపు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లాంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఖర్గే భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ భారత్ యాత్రలో ఉండడంతో ఆయన అక్కడ పెద్దగా దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఖర్గే దీన్ని భుజాన వేసుకోవాలి. అదే సమయంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సి ఉంటుంది. అంతేకాక.. పార్టీలో సరైన నాయకులను గుర్తించి టీమ్ ను పటిష్టం చేయాల్సి ఉంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునర్వైభవం సాధ్యమవుతుంది.













