ఇరాన్ కొత్త గగనతల రక్షణ వ్యవస్థ అరాశ్..!
అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఎప్పటికప్పుడు సరికొత్త అస్త్రాలను రంగంలోకి దించుతోంది. అసలా అస్త్రం ఏంటో తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తర్వాత అదేంటి..? దాని పనితీరుపై అగ్రరాజ్యం దృష్టి పెడుతోంది. ప్రపంచం సైతం ఆ అస్త్రంపై ఆసక్తి చూపిస్తోంది. లేటెస్టుగా అరాశ్ అనే గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్ ప్రయోగించింది.
అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన ఆయుధాలను టెహ్రాన్ చాలా చౌకగా మసిచేస్తుండటం అగ్రరాజ్యానికి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల హర్మూజ్ సమీపంలో అమెరికాకు (USA) చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను ఇరాన్ (Iran) ఇలాగే కూల్చేసింది. ఇందుకోసం తాము స్థానికంగా అభివృద్ధి చేసిన కొత్త గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించినట్లు టెహ్రాన్ పేర్కొంది. అదే ‘అరాశ్ ఇ కమాన్‌గీర్’..!
హర్మూజ్ (Strait of Hormuz) సమీపంలోని శత్రు డ్రోన్‌ను కూల్చేందుకు ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘అరాశ్ ఇ కమాన్‌గీర్’ సిస్టమ్‌ను ఉపయోగించినట్లు ఐఆర్జీసీ అనుబంధ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇది అత్యంత సమర్థమైన వ్యవస్థ అని పేర్కొంది. అయితే, దాని సాంకేతిక వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.
సాధారణంగా అమెరికాతో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్ చౌకగా లభించే, వేగంగా మోహరించే స్వదేశీ రక్షణ వ్యవస్థలనే వినియోగిస్తోంది. గతంలో అమెరికాకు చెందిన అత్యాధునిక క్షిపణులను షాహెద్ వంటి డ్రోన్లతో అడ్డుకుంది ఇరాన్. దీనివల్ల సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగితే ఆర్థిక భారం పడకుండా ఉంటుందనేది ఇరాన్ భావన. ఇప్పుడు కూడా ఇలాగే ‘అరాశ్’ వ్యవస్థను ఉపయోగించి ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ది ఆర్చర్ అనే వీరుడి పేరుతో…
పర్షియన్ పురాణాల ప్రకారం ‘అరాశ్: ది ఆర్చర్’ అనే ఓ యోధుడు ఉండేవాడట. పశ్చిమ దేశాల ప్రభావం ఇరాన్‌పై పడకుండా ఉండేందుకు అతడు పోరాడినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే మధ్య ఆసియా, ఇరాన్ మధ్య అతడు బాణంతో సరిహద్దు గీసినట్లు పేర్కొంటారు. ప్రాణాలు అర్పించి మరీ అరాశ్ ప్రయోగించిన ఆ బాణం.. కొన్ని రోజుల పాటు వందల మైళ్లు ప్రయాణించి చివరకు మధ్య ఆసియాలోని ఓ నది ఆవల ఉన్న చెట్టును తాకినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. అక్కడి వరకు ఇరాన్ సరిహద్దు అని అరాశ్ చెప్పినట్లయ్యింది. ఆ వీరుడు పేరు మీదుగానే ఇరాన్ తమ సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థకు ‘అరాశ్ ఇ కమాన్‌గీర్’ అని పేరు పెట్టింది.
తక్కువ బడ్జెట్లో ఇరాన్ అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ‘అరాశ్’ కీలక ముందడుగు అని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీని సామర్థ్యాలేంటో పూర్తిగా బయటకు రానప్పటికీ.. కొంతమంది విశ్లేషకులు దీని పనితీరును అంచనా వేస్తూ పలు నివేదికలు రూపొందించారు. సాధారణ గగనతల రక్షణ వ్యవస్థల మాదిరిగా.. ఇది రాడార్లు, లాంచ్ బ్యాటరీలపై ఆధారపడి పనిచేయదు. రాడార్ సైట్లు ఇచ్చే నిర్దిష్ట మార్గదర్శకాలపై ఆధారపడదు. ఎలక్ట్రో ఆప్టికల్ లేదా హీట్-సీకింగ్ గైడెన్స్ వ్యవస్థల వినియోగించుకుంటుంది. ఇందులోని ఇంటర్‌సెప్టర్ కొన్ని గంటల పాటు గాల్లో తిరుగుతూ శత్రు డ్రోన్లు, విమానాలను గుర్తిస్తుంది. అవి కన్పించగానే పేల్చేస్తుంది. వీటిని తయారు చేయడం, మోహరించి ఉపయోగించడం చాలా తేలిక అని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవస్థ కూల్చిన ఎంక్యూ-9 డ్రోన్ విలువ దాదాపు 16 మిలియన్ డాలర్ల నుంచి 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.







