ఆర్థిక వ్యవస్థపై అమెరికన్ల ఆందోళన… గట్టెక్కించేవారికే ఓటు…
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఇరు పార్టీలకు డూ ఆర్ డై లా మారాయి.ఓటర్లను ఆకర్షించడానికి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో దేశ ఆర్థిక వ్యవస్థ అంశం కీలకంగా మారింది. తాజాగా అసోసియేటెడ్ ప్రెస్ – సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తమ ఆర్థిక వ్యవస్థ పేలవంగా ఉందని అమెరికా పౌరులు భావిస్తున్నట్లు తేలింది. కొంతమంది పౌరులు తమ ఆర్థికవ్యవస్థ సరైన దిశలో ప్రయాణించడం లేదని ఆందోళన చెందుతున్నట్లు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో ఏడుగురు ఓటర్లు తమ దేశ ఆర్థిక వ్యవస్థ తప్పుడు దిశలో ప్రయాణిస్తుందని అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, నేరాలు కన్నా ఎకానమీనే ప్రధాని సమస్యగా ఎక్కవ మంది ఓటర్లు పరిగణిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే నాయకుడికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు సర్వే వెల్లడించింది.
ఆర్థిక వ్యవస్థపై బిన్నదారులు.. భిన్న ఆలోచనలు..
ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కమలా హారిస్, ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలనే దానిపై విభిన్న ఆలోచనలతో ఉన్నారని సర్వే తెలిపింది. అయితే, ఏ ఒక్కరు కూడా తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో పూర్తిగా వివరించలేదు. కమలా హారిస్ తమ ప్రణాళికలన్నింటికీ పూర్తిగా బడ్జెట్ నుంచే నిధులు సమకూరుస్తామని చెబుతున్నారు. ఇందుకు విరుద్ధంగా ట్రంప్ తమ ప్రణాళికల కోసం ఒకవేళ అప్పు చేసినా, ఆ ఖర్చును భర్తీ చేయడానికి తగినంత వృద్ధి ఉంటుందని వాదిస్తున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ట్రంప్ అంటున్నారు. కార్పోరేట్ కంపెనీలకు పన్నును 21 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. తద్వారా వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెబుతున్నారు.
అలాగే, వివిధ దేశాల నుంచి దిగుమతుల చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు విధిస్తానని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో యూఎస్ డాలర్‌ను ఉపయోగించని దేశాలపై వంద శాతం సుంకం విధించడానికి వెనుకాడబోనని ట్రంప్ అన్నారు. మరోవైపు కమలా హారిస్ మధ్యతరగతి ప్రజలపై దృష్టి సారిస్తానని చెబుతున్నారు. ధరల పెరుగుదల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. సరైన ప్రణాళికలతో అవకాశాల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సంపన్నులపై అధిక పన్నులు విధించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు నిధులు సమకూరి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇది ఖర్చులు అదుపులో ఉండటానికి, వృద్ధి రేటు పెరగడానికి సహాయపడుతుందన్నారు. ట్రంప్ ప్రవేశపెట్టదలచుకున్న సుంకాలు అమెరికాలో అధిక ధరలకు దారితీస్తాయని కమలా హెచ్చరిస్తున్నారు.
తటస్థ ఓటర్లే కీలకం
సెప్టెంబర్ నెలలో అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన సర్వేలో ప్రతి పది మంది ఓటర్లలో 8 మంది ఓటర్లు ఆరోగ్య సంరక్షణ, నేరాలు కన్నా ఎకానమీనే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నట్లు తేలింది.ఈ విషయంలో ఉత్తమంగా ఉన్నఅభ్యర్థికే తాము మద్దతిస్తామని చెప్పినట్లు నాటి సర్వే వెల్లడించింది. మధ్యతరగతి ప్రజలపై దృష్టి సారిస్తానని కమలా ఇచ్చిన హమీలకు 46 శాతం మంది మద్దతిచ్చినట్లు నాటి సర్వే పేర్కొంది. దీంతో తటస్థ ఓటర్లు ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తి నెలకొంది. వాళ్ల కోసం అభ్యర్థులు ఇద్దరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.






