ప’వార్’ పాలిటిక్స్…
మరాఠా యోధుడి రాజ్యంలో అసమ్మతి సెగలు కక్కుతోందా? అధినేత శరద్ పవార్ మాటకు విధేయుడిగా ఉన్న అజిత్ పవార్… రెబల్ గా మారనున్నారా? ఇప్పుడిదే అంశం మరాఠా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా, అజిత్ పవార్ మరో బాంబు పేల్చారు. తనకు అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేత పదవిపై ఆసక్తి లేదని ప్రకటించారు. ఆ బాధ్యత నుంచి తనను తప్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, పార్టీలో బాధ్యత అప్పగించాలని, ఏ పదవి ఇచ్చినా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్ఠానాన్ని కోరారు. ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవం రోజునే అజిత్ పవార్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతేడాది జూన్‌లో శివసేన పార్టీలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది.ఆ తర్వాత షిండే సారథ్యంలోని శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అజిత్ పవార్‌ను అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేతగా నియమించారు. కాగా, ఇటీవలే ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే, మరో సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌ను శరద్ పవార్ నియమించారు. కానీ, అజిత్ పవార్‌కు మాత్రం ఎలాంటి పార్టీ బాధ్యతలు కట్టబెట్టలేదు.శరద్ నిర్ణయంపై అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీన్ని కొట్టిపారేసిన అజిత్ పవార్.. తాను పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు బాధ్యతలు చేపట్టిన సుప్రియ, ప్రఫుల్ పటేల్ కు శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో ఎన్సీపీలో చీలికకు బీజేపీ ప్రయత్నించిన పరిస్థితి ఉంది. బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్.. అజిత్ పవార్ తో చర్చలు జరిపారు. దీంతో అజిత్ పవార్ పార్టీ నుంచి బయటకు వెళ్లినట్లే కనిపించారు. అయితే శరద్ చక్రం తిప్పాక.. మొత్తం సీటన్ మారిపోయింది. దీంతో కంగుతున్న బీజేపీ… ఎన్సీపీని వదిలి, శివసేనపై ఫోకస్ పెట్టి, చీల్చడంలో విజయం సాధించింది. అప్పటి నుంచి శరద్ పవార్.. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించిన శరద్ పవార్.. బాధ్యతలు వారసులకు అప్పగించేందుకు ప్రయత్నించారు. తాను రిటైర్ అవుతానంటూ ఇటీవలే ప్రకటించడంతో….పార్టీలో అగ్గిరేగింది. దీంతో తన రిటైర్ మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. నెమ్మదిగా అధికారాన్ని బదలాయించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈవ్యవహారంలో అజిత్ పవార్ కు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో.. ఆయన వర్గం ఆందోళన చెందుతోంది. దీనిలో భాగంగా శరద్ సమక్షంలోనే అజిత్ పవార్… తనకు పార్టీ బాధ్యతలు కావాలని కోరడం జరిగింది. దీనిపై పార్టీలో చర్చించి ఓనిర్ణయం తీసుకుంటామన్నారు శరద్ పవార్.













