ఎన్సీపీలో చీలిక…
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అజిత్ పవార్ అధికార పక్షంలో చేరారు. ముఖ్యమంత్రి శిండేతో భేటీ తర్వాత మద్దతుదారులు 9 మందితో కలిసి గవర్నర్‌ను కలిశారు. వెనువెంటనే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి ఠాక్రే, హసన్ ముష్రీఫ్,ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో విడిగా అజిత్‌పవార్ తన స్వగృహం దేవగిరిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శరద్ పవార్కుమార్తె సుప్రియా సూలే సహా పలువురు ఎన్సీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశం నుంచి సుప్రియ అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయారు. అజిత్ పవార్ రాజ్‌భవన్‌కు తరలివెళ్లగా.. సీఎం ఏక్నాథ్ శిందే సైతం అక్కడికి చేరుకున్నారు.
ఎన్సీపీ కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ..నవంబర్ 23న ఉదయాన్నే గవర్నర్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ వ్యవహారం మహా రాష్ట్రరాజకీయాల్లో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఇటీవలే శరద్ పవార్…మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ మధ్య .. నాటి ఘటనపై మాటల యుద్ధం కొనసాగింది. పవార్ ఆత్మకథలో రాసిన ఘటనలపై ఫడ్నవీస్ స్పందించడంతో.. దానికి శరద్ పవార్ కౌంటరిచ్చారు. మాటల తూటాలు పేలుతుండగానే.. ఎన్సీపీ చీలిపోయింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి ప్రస్తుతం 53 మంది సభ్యులున్నారు. వారిలో దాదాపు 30 మంది అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో ఎన్సీపీ నిలువునా చీలినట్లైంది. ఓవైపు శివసేనను చీల్చేసిన బీజేపీ.. ఇప్పుడు ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో సంవత్సరంలో ఎన్నికలు రానున్న తరుణంలో… మహారాష్ట్రలో విపక్షాలు చీలిపోవడం వెనక.. బీజేపీ ప్లానింగ్ వర్కవుట్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.













