వ్యూహమా..? వ్యూహాత్మకమా?
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏకి గట్టి దెబ్బ తగిలింది. తమిళనాడులో ప్రధాన విపక్షం అన్నాడీఎంకే.. కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలతో కూడిన కూటమితో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపింది.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆతర్వాత తాము కూటమి నుంచి బయటకు వచ్చినట్లు పార్టీ సీనియర్ నేత కేపీ మునుస్వామి ప్రకటించారు.
ఇటీవల పళనిస్వామిని ఢిల్లీ పిలిపించుకున్న కేంద్ర హోమంత్రి అమిత్‌షా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు కనీసం 20 సీట్లు కావాలని చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు దివంగత సీఎంలు జయలలిత, అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు ఆపార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అన్నాడీఎంకే నేతల్నీ అవినీతిపరులుగా పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేసిన జాబితా మరింత దుమారం రేపుతోంది. వీటన్నింటి నేపథ్యంలోనే కొంతకాలంగా అన్నాడీఎంకే నేతలు బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు తమతో పొత్తు కుదరదంటే ‘డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్’ ఎలాగూ వుందంటూ అన్నామలై చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేతలకు చికాకు తెప్పించాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తమ అధినేత నిర్ణయం పట్ల అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నాయి.
బీజేపీతో కలిసి సాగితే రాష్ట్రంలో తాము పూర్తిగా నష్టపోవడం ఖాయమని తేలడంతో.. ‘ఎన్నికల వరకూ ఎవరికివారుగా పోటీ చేసి, ఫలితాలు వచ్చాక మద్దతు ఇస్తామన్న’ ఒప్పందం మేరకే ఈ ‘విడాకుల’ ప్రకటన జరిగిందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అన్నామలై ఒంటెత్తు పోకడలు, ఉదయనిధి సనాతన ధర్మ నిర్మూలనా నినాదం వంటి వాటితో తమిళనాట బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తే తాము కూడా నష్టపోతామని, అందువల్ల ఎన్నికల్లో ఫలితాలు వచ్చాక కేంద్రంలో అవసరమైతే మద్దతు ఇస్తామని పళనిస్వామి అమిత్‌షాకు నచ్చచెప్పారని డీఎంకే, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి., ఆయన అనుమతి తీసుకున్నాకే ఇలా కూటమి వీడుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించిందంటున్నాయి.
జయలలిత మరణానంతరం తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు మాజీ సీఎంలు పన్నీర్‌సెల్వం, పళనిస్వామి బీజేపీ శరణుజొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో కూడిన కూటమి ఘోరపరాజయాన్ని చవిచూసింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను ఒకే ఒక సీటును దక్కించుకోగలిగింది. ఆ తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు సాధించుకోగలిగినా అన్నాడీఎంకే మాత్రం తీవ్రంగా నష్టపోయింది. దీంతో బీజేపీతో కలిసి సాగితే తమ పుట్టి మునగడం ఖాయమని భావిస్తున్న అన్నాడీఎంకే నేతలు.. ఇదే అదనుగా ఆ పార్టీని వదిలించుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.













