అభిమానుల హృదయ దళపతి
తమిళనాడులో మరో రాజకీయపార్టీ రావడం కచ్చితంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ రజినీ తర్వాత ఆస్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్..రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాడు. అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుచుకునే విజయ్..సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాలపైనా దృష్టి సారించారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. ప్రతిభ కనబరిచిన పదో తరగతి, ప్లస్‌వన్, ప్లస్‌టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో.. విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ మక్కల్ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయ్యారు. ఇటీవలే చెన్నై శివారు పనైయూర్లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండాలపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ముఖ్యంగా పార్టీ పేరుపై ఆయన ఎక్కువసేపు నిర్వాహకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీకి మక్కల్(ప్రజలు), తమిళగం(తమిళనాడు), మున్నేట్రం(అభివృద్ధి), కళగం(పార్టీ) వంటి పదాలు విజయ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ మూడు పదాలు కలిసేలా తమిళగ మున్నేట్ర కళగం పేరును వినిపించినట్లు సమాచారం. ఇదే పేరు తాజాగా ఎన్నికల సంఘంలో కూడా నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్, ఆయన అభిమాన సంఘం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. విజయ్‌కి 2026లో జరిగే శాసనసభ ఎన్నికలే టార్గెట్‌గా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు అరంగేట్రం చేసి ఎదురయ్యే తప్పొప్పులు సరిచేసుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనే నిశ్చయానికి వచ్చినట్లు సమాచారం.
కెరీర్ మొదలైన కొంతకాలం నుంచే కన్నడ, మలయాళంలో కూడా ఆయనకు మార్కెట్ మొదలైంది. ఇప్పుడు తెలుగులోనూ పెద్ద మార్కెట్ ఏర్పడింది. ఇటీవలే ఓ సినిమాకు తమిళంలో రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఓ చిత్రంలో తెలుగు మార్కెట్ కోసం రూ.40 కోట్లు కలుపుకొని మొత్తం రూ.140 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారంవిజయ్కి ఈస్థాయి స్టార్డమ్ రావడం వెనుక తెలుగుచిత్రాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ కెరీర్లో పోక్కిరి, గిల్లి, బద్రి, ఆది, వేలాయుధం, యూత్ వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరీర్‌ను మలుపుతిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. విజయ్.. పవన్‌కల్యాణ్‌ను ఎక్కువగా అనుకరించేవారు. ఆయన పాటలు, సినిమాలను రీమేక్ చేశారు. తమిళంలో అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో రెండుసార్లు నేరుగా సమావేశమై వారికి బిరియాని వడ్డించడం, బహుమతులు ఇవ్వడం చేస్తున్నారు.













