శవరాజకీయాలు…?
బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుపొందింది. మరీ ముఖ్యంగా హింసాత్మక ఘటనల జరిగిన ప్రాంతాల్లో స్వీప్ చేసింది. పార్టీకి ఓటేసి గెలిపించిన ఓటర్లకు మమత కృతజ్ఞతలు తెలిపారు. హింసాత్మక ఘటనల పట్ల విచారం వ్యక్తం చేసిన మమత మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 2 లక్షల పరిహారం ప్రకటించారు. రాష్ట్రంలో తనను దూషిస్తూ, జాతీయస్థాయిలో జట్టుకట్టమంటారంటూ కాంగ్రెస్, కమ్యూనిస్టులకు చురకలు వేశారు.
మరోవైపు బెంగాల్లోని హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ నిజనిర్ధారణ బృందం.. జరిగిన దారుణంగా ఆందోళన వ్యక్తం చేసింది. తమ కార్యకర్తలే లక్ష్యంగా తృణమూల్ గూండాలు దాడులు చేశారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. హత్యారాజకీయం చేసి తృణమూల్ కాంగ్రెస్ గెలుపు దక్కించుకుందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింసపై బీజేపీ నిజనిర్ధారణ బృందం రాష్ట్రానికి రావడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. నిజనిర్దారణ బృందం కాదు.. రెచ్చగొట్టే బృందమని ఆరోపించారు. మణిపూర్ హింసాకాడంతో అట్టుడికినప్పుడు నిజనిర్ధారణ బృందం ఎక్కడుంది? ఎన్సీఆర్ నిరసనల సమయంలో అసోంలో హింసాకాండ చెలరేగినప్పుడు ఈ టీమ్ ఏమైంది? అని కేంద్రాన్ని నిలదీశారు. గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రానికి వచ్చిన బృందాలు ”బీజేపీ రెచ్చగొట్టే కమిటీలు” అని సీఎం ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో గెలుపుకోసం ఇరుపార్టీలు మూకదాడులకు ప్రోత్సహించాయని… ఫలితంగానే 33 మంది ప్రాణాలు కోల్పోయారని స్వచ్ఛందసంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలైన తర్వాత కూడా ప్రతీకార దాడులు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో ఎన్నికలు జరుగుతాయంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని చెబుతున్నాయి. చాలా మంది ఎన్నికల సమయంలో వేరే ప్రాంతాలకు తరలిపోయి, ఎన్నికల తర్వాత స్వస్థలాలకు చేరుకున్న సందర్భాలున్నాయని చెుతున్నాయి. ఒకప్పుడు దేశానికి జ్ఞాన వెలుగులు ప్రసాదించిన నేల.. ఇప్పుడు హింసకు కేంద్రం కావడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.













