ఆ మాత్రం దానికే విడాకులు తీసుకోవాలా?
మహిళా సాధికారత, ఆత్మగౌరవ ఔన్నత్యాన్ని తెలియజెప్పే కథాంశంతో రూపొందుతున్న థప్పడ్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది తాప్సీ. అనుభవ్సిన్హా దర్శకుడు. ఈ సినిమాలో మధ్యతరగతి ఇల్లాలిగా కనిపించనుంది తాప్సీ. ఓ చెంపదెబ్బ భార్యాభర్తల అనుబంధాన్ని ఎలా ప్రభావితం చేసింది? వారు విడాకులు కోరడానికి ఏవిధంగా కారణమైందనే అంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల్ని పంచుకుంది తాప్సీ. ఆమె మాట్లాడుతూ భార్యపై భర్త చేయిచేసుకోవడాన్ని చాలా మంది చిన్న విషయంగా చూస్తారు. ఆ మాత్రం దానికే విడాకులు తీసుకోవాలా? భార్యాభర్త బంధంలో ఇవన్నీ మామూలే అని చెబుతుంటారు. చెంప దెబ్బ చిన్న విషయమే కావొచ్చు. కానీ అందులో స్త్రీ ఆత్మగౌరవం దాగి ఉంటుంది. పరస్పరం గౌరవం లేకుండా ఏ బంధం నిలవదు. ఒక్క చెంపదెబ్బ అయినా సరే అవి వివక్ష, హింస కిందకే వస్తుంది. మహిళలపై జరిగే ఎలాంటి అన్యాయాన్ని అయినా సాటి మహిళలు ప్రశ్నించాలి. ఆ చైతన్యం రావాలి అని చెప్పింది తాప్సీ.













