పాఠశాల బోధన పక్రియ భేష్
ఆంధప్రదేశ్ విద్యాశాఖ అనుబంధ సంస్థగా గుర్తింపు పొందిన ‘పాఠశాల’ అమెరికాలో ఎన్నారై పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న విధానం బావుందని ఆంధప్రదేశ్ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చినవీరభద్రుడు చెప్పారు. పాఠశాల సిఇఓ, తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు అమరావతిలో ఆయనను కలిసి పాఠశాల అమెరికాలో తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న విధానం, పాఠ్యపుస్తకాల వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాషా బోధన విధానంలో మరింత మార్పులు రావాలని, మూస పద్ధతులతో కాకుండా వారికి సులభంగా అర్థమయ్యేలా బోధన, పుస్తకాలు ఉండాలన్నారు. 2వ తరగతిలోనే వారికి తెలుగు కవులు, తెలుగు భాష గురించి తెలియజేయాలన్నారు. చిన్నవయస్సులోనే వారికి తెలుగు సంస్కృతి, ఆచార వ్యవహారాలు తెలియజేస్తే అవి ఎప్పటికీ మరిచపోలేరన్నారు. ఇందుకు అనుగుణంగానే ఎస్ఇఆర్టీని పుస్తకాలను రూపొందించాలని కోరినట్లు చెప్పారు. కొత్తగా వచ్చే పాఠ్యపుస్తకాలు మరింతగా ఆకట్టుకుంటాయని తెలిపారు. పాఠశాలకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు.













