ఖమ్మం లోక్ సభ బరిలో నామా ?
ఖమ్మం లోక్‌సభ బరిలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. అలాగే పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడంతో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాదించింది. దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేసినా, చేయకపోయినా ఖమ్మం పార్లమెంట్లో మాత్రం పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నది, అంతేకాకుండా మధిర, సత్తుపల్లి, అశ్వారావు పేట, పాలేరు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నాయని, ఈ ఎన్నికల్లో ఖమ్మం పోటీ చేయడం ద్వారా టీఆర్ఎస్కు గట్టి గుణపాఠం చెపుతామని టీడీపీ నేతలు విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నా లేకపోయినా ఖమ్మంలో పోటీ చేయాలని అభ్యర్థిగా మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరావు ఉంటారని ప్రచారం జరుగుతంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లో పోటీచేసినా నామా నాగేశ్వరరావు ఓటమి పాలైనప్పటికీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయనపట్ల సానుభూతి అధికంగా ఉన్నదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఒక స్థానంలో కూడా పోటీ చేయకపోతే పార్టీ ఉనికే నష్టం జరుగుతుందని అందుకే ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ కూడా భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వంలో మాట్లాడి ఖమ్మంలో టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ఒప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో నామా నాగేశ్వరరావు ఒకసారి ఓడిపోయి తరువాత గెలిచారని, ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్‌కు గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.













