రాజకీయ పార్టీపై త్వరలో నిర్ణయం
ఐకాస తరపున రాజకీయ పార్టీ అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30న కొలువులకై కొట్లాట సభ నిర్వహిస్తామని అన్నారు. శాంతిభద్రతల పేరుతో సభలు, నిరసనలను ప్రభుత్వం అడ్డుకోజాలదని అన్నారు. కొలువులకై కొట్లాట సభకు సంబంధించి కోర్టులో తమకు అనుకూల తీర్పు రావడం ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. పోలీసులు సరూర్నగర్ మైదానంలో సభ పెట్టుకోవచ్చని తెలిపారని చెప్పాడు. ప్రభుత్వ నిరంకుశ ధోరణి వల్లే ఈ సభను నిర్వహించలేకపోయామని అన్నారు. నల్గొండలో డిసెంబర్ 9,10 తేదీల్లో అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఖాళీలను ప్రకటించి, భర్తీ చేసేందుకు క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒప్పంద ఉద్యోగులకు సమాన పని, సమాన వేతనం చెల్లించాలని కోరారు.













