రాష్ట్రావతరణ దినోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషీ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆయన అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, డీజీపీ మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 2న పరేడ్ మైదానంలో జరిగే వేడుకలకు అన్ని రకాల సన్నాహాలను నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. గన్‌పార్క్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించి, పరేడ్ మైదానం చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, పీపుల్స్ ప్లాజాలలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని, ప్లాజా వద్ద తెలంగాణ ఆహార పండుగను జరుపుతామని బుర్రా వెంకటేశం వెల్లడించారు.













