వలసదారులపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెక్సికో సరిహద్దు నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న మధ్య అమెరికన్ వలసదారులను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. మెక్సికో సరిహద్దు వద్ద ఉండే సైనికులపై రాళ్లు రువ్వితే కాల్పులు జరుపుతామని పేర్కొన్నారు. వలసదారులు అక్రమంగా సరిహద్దు దాటే సమయంలో మీపై రాళ్లు రువ్వితే వారిని కాల్చేయండి అంటూ ట్రంప్ సైనికులకు సూచించారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్య అమెరికాకు చెందిన వలసదారులు మెక్సికో మీదుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. మెక్సికో వద్ద సరిహద్దు దాటే సమయంలో భద్రతాసిబ్బందిపై రాళ్లు రువ్వుతున్నారు. మేము చూస్తూ ఊరుకోము. వాళ్లు మా సైనికులపై రాళ్లు రువ్వితే, మా మిలటరీ కూడా తిరిగి పోరాడుతుంది. రాళ్లను రైఫిల్‌గా అనుకొమ్మని నేను మా సైనికులకు చెప్పాను అని ట్రంప్ తెలిపారు. అక్రమ వలసదారులను నియంత్రించే అంశంపై మాట్లాడుతూ ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.













