మోదీ జీవితం ఎంతో మందికి ఆదర్శం : ట్రంప్
భారత్‌ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురింపించారు. మోతెరా లాంటి అద్భుతమైన స్టేడియంలో ప్రసంగించడం గర్వంగా ఉంది. భారత్‌లో నాకు ఘన స్వాగతం లభించింది. దీన్ని నేను, మెలానియా ఎప్పటికి మర్చిపోం అని అన్నారు.
మోదీ అసాధారణ నేత అని అన్నారు. భారత్ అభివృద్ధి కోసం ఆయన రాత్రింబవళ్లు ఎంతగానో కృషిచేస్తున్నారని ప్రశంసించారు. మోదీ గు•రాత్‌కు మాత్రమే ఆదర్శం కాదని, శ్రమ పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని ఆయన నిరూపించారని ట్రంప్ చెప్పారు. మోదీ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ప్రపంచంలో అందరూ ఆయన్ను అభిమానిస్తారు. నా నిజమైన స్నేహితుడు మోదీ. అద్భుత విజేతగా దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద పుట్‌బాల్ మైదానంలో మోదీకి స్వాగతం పలికాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంలో నాకు స్వాగతం పలికారు అని చెప్పారు.
ప్రపంచానికి భారత్ ఎదుగుదల ఓ మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామ్య దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. భారత్ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ కలిసి జీవించే దేశం ఇది. వందకు పైగా భాషలతో కలిసిమెలిసి ఉండే భారత్ ప్రపంచానికి ఎంతో ఆదర్శం. అమెరికా గుజరాతీలు అందించిన సేవలు ప్రశంసనీయమైనవి. దక్షిణాసియాలో భారత్ అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. వాణిజ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవల కాలంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 40 శాతం పెరిగింది. ఇరుదేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు వృద్ధి పథంలో ఉన్నాయి. మోదీ వేగవంతమైన సంస్కరణలతో వ్యాపార వాణిజ్యంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశాభివృద్దిలో మహిళా పారిశ్రామికవేత్తలు గొప్ప ప్రగతి సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకొస్తున్నారు. పురుషులూ జాగ్రత్తగా ఉండండి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.













